ఖమ్మంలో ఎన్నికల భారీ బహిరంగ సభ | Telangana Elections KCR Sabha In Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ఎన్నికల భారీ బహిరంగ సభ

Sep 26 2018 8:01 AM | Updated on Sep 26 2018 8:01 AM

Telangana Elections KCR Sabha In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి,ఖమ్మం: టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మంజిల్లా లో ఎన్నికల శంఖా రావం పూరించడానికి సమాయత్తమైంది. నోటిఫికేషన్‌ రావడానికి ముందే.. ఖమ్మం వంటి రాజకీయ చైతన్యవంతమైన జిల్లాలో ప్రచార పర్వాన్ని ప్రారంభించాలని సంకల్పించింది. ఈ మేరకు.. అక్టోబర్‌ 8వ తేదీన టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు.. పార్టీ ఖరారు చేసింది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పర్యటన ఏర్పాట్లకు అంతా సిద్ధం చేయబోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పార్టీ సమాచారం అందించడంతో పాటు కార్యకర్తల సమీకరణ చేయాలని సూచించింది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ 8వ తేదీ మధ్యాహ్నం ఖమ్మం చేరుకుని.. స్థానిక ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే.. ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ కోసం..ఇటు మంత్రి తుమ్మలతో పాటు ఖమ్మం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఏర్పాట్లు, జన సమీకరణపై దృష్టి సారించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు రాష్ట్రమంతటా చాటిచెప్పేవిధంగా జన సమీకరణ, ఏర్పాట్లు ఉండాలని భావిస్తున్న పార్టీ నేతలు ఈ మేరకు.. కేసీఆర్‌ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణపై దృష్టి సారించారు. కేసీఆర్‌.. పర్యటనకు సంబంధించి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి జన సమీకరణ చేయడానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. ఈ పర్యటనలో పార్టీలో నెలకొన్న..అసమ్మతి, అసంతృప్తులు, కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యానికి కాయకల్ప చికిత్స చేసి.. నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించే విధంగా దిశానిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం, పాలేరుతో పాటు సమీప నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేసీఆర్‌ పర్యటనకు ఇంకా 13 రోజుల సమయం ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు జన సమీకరణపై దృష్టి సారిం చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మంకు ఆరోజు ఎన్ని గంటలకు చేరుకుంటారు..? ఎన్ని గంటల వరకు ఉంటారు..? అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement