ముందస్తు కిక్కు

Telangana Election Liquor Store In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: జిల్లాలో అప్పుడే ముందస్తు ఎన్నికల కిక్కు మొదలైంది. సెప్టెంబర్‌ 6న అసెంబ్లీ రద్దు కావడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత ఏడాది నుంచి  మద్యంషాపుల లైసెన్స్‌ల గడువు రెండేళ్లు పొడగించడంతో వచ్చే యేడు అక్టోబర్‌ 1వ తేదీ వరకు ఉండనుంది. వ్యాపారులు ఉహించినట్లుగానే ముందస్తు ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు రానుండడంతో మద్యం అమ్మకాలు జోరందుకోనున్నాయి. గత నెల నుంచి ముందస్తు ఎన్నికల హడావుడి  మొదలు కావడంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో మరింత  ఊపందుకుంటాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 58 వైన్స్‌ షాపులు ఉండగా వర్ధన్నపేట పరిధిలో 14, నర్సంపేట పరిధిలో 22, పరకాల పరిధిలో 22 వైన్స్‌ షాపులు ఉన్నాయి. జిల్లాలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూడు, ఎలైట్‌ బార్‌లు 5 ఉన్నాయి.

పెరిగిన ఆదాయం
జిల్లాలో గతంలో కంటే ప్రస్తుతం ఆదాయం పెరిగింది. సెప్టెంబర్‌–2017లో 46,201 ఐఎంఎల్‌ కేసులు, 51,576 బీర్‌ కేసులు అమ్ముడుకాగా వీటి ద్వారా రూ.23,69,27,000 వచ్చాయి. 2018 సెప్టెంబర్‌లో 51,536 ఐఎంఎల్‌ కేసులు, 57,990 కేసుల బీర్లు అమ్ముడుపోగా రూ.28,15,98,000 వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే రూ.4.46 కోట్ల విలువైన అమ్మకాలు పెరిగాయి. 19 శాతం ఆదాయం పెరిగింది. అక్టోబర్‌ 2017 నుంచి సెప్టెంబర్‌ 2018 వరకు 6,31,014 ఐఎంఎల్‌ కేసులు, 8,41,173 బీర్‌ కేసులు(మొత్తం రూ.356.76 కోట్లు) విక్రయించారు.

ముందుచూపుతోనే డంపింగ్‌
ఎన్నికల సీజన్‌ మొదలు కావడంతో నేతలు ముందు చూపుతోనే భారీగా మద్యాన్ని డంప్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కొరత, అధిక ధరలు ఉంటాయని  అంచనా వేస్తున్న నాయకులు మద్యం డంప్‌లపై  ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా నేతలు మద్యం డంప్‌లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మద్యంను డంప్‌ చేస్తూ గ్రామాల్లోని ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

వ్యాపారులకు కాసుల పంట
ఇప్పటికే ఏడాది కాలం ముగిసిపోయిన వైన్స్‌షాపులకు మరో ఏడాది కాల పరిమితి ఉంది. ఈ లోగా వరుసగా ఎన్నికలు రావడంతో ఇక వ్యాపారులకు కాసుల పంట పండినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికలతోపాటు త్వరలో పార్లమెంట్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీ ఎన్నికలు కూడా రానున్నాయి. అందుకే  అప్పట్లో వ్యాపారులు పోటీపడి మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. వ్యాపారుల అంచనాకు  తగ్గట్టుగానే మద్యం అమ్మకాలు పెరిగిపోతున్నాయి. మద్యం వ్యాపారులకు బరిలో నిలిచే అభ్యర్థులు మద్యం కొనుగోలు కోసం అడ్వాన్స్‌లు కూడా  ఇస్తున్నట్లు తెలిసింది.

అమ్మకాలు పెరిగాయి...
గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చి చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి. మద్యం వ్యాపారులకు ఇచ్చిన లిమిట్‌ వరకు అందిస్తున్నాం. లిమిట్‌ దాటితే మద్యంను వ్యాపారులకు అందించం.  –శ్రీనివాసరావు, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top