మరో చాన్స్‌ 

Telangana Congress Party's DCC  List Mahabubnagar - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఒబేదుల్లా కొత్వాల్‌ మళ్లీ ఆ పదవికి నియామకం అయ్యారు.  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించిన తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల అధ్యక్షుల జాబితాను ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం ప్రకటించారు. 2012 ఏప్రిల్‌ మొదటి సారి డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికై అప్పట్లో ఏపీలోనే 49 ఏళ్ళ ప్రాయంలో ఆ పదవిని పొందిన పిన్న వయస్సు నేతగా కొత్వాల్‌ పేరొందారు. ఒబేదుల్లా కొత్వాల్‌ పాన్‌గల్‌ మండల కేంద్రంలో 1962 జూన్‌ 1వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి అసదుల్లా కొత్వాల్‌ పాన్‌గల్‌ మాజీ సర్పంచుగా, ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు.

2012 నుంచి ఇప్పటివరకు కొత్వాల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగగా ఈ సారి మిగతా మూడు జిల్లాలకు కూడా వేర్వేరుగా డీసీసీ అధ్యక్షులను నియామకం చేశారు. అయితే డీసీసీ అ«ధ్యక్షుడిగా కొత్వాల్‌ అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన సీనియారిటీని గుర్తించిన అధిష్టానం తిరిగి డీసీసీ అధ్యక్షుడిగా నియామకం చేసినట్లు తెలుస్తోంది. వివాదరహితుడిగా ఉన్న కొత్వాల్‌ అందరిని కలుపుకుపోయి పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపిస్తారన్న నమ్మకంతో అధిష్టానం ఆయనను అధ్యక్షుడిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి..  
ఇంటర్‌మీడియెట్‌ చదివిన రోజుల నుంచే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన  కొత్వాల్‌ 1979లో నిజామాబాద్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ మహబూబ్‌నగర్‌కు వచ్చిన అనంతరం కూడా 1983 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1983 నుంచి 85 వరకు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా, 1986 నుంచి యువజన కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి మంచి పేరును గడించారు.

1987 నుంచి 1992 వరకు జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా,18 ఏళ్ళపాటు డీసీసీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 1992లో పాన్‌గల్‌ సింగిల్‌ విండో చైర్మన్‌గా ఏకగ్రీవంగా విజయం సాధించి డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఎన్నికై 1995 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1994 ఎన్నికల్లో  కొల్లాపూర్‌ అసెంబ్లీ టికెట్‌ను సాధించినప్పటికీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2005 నుంచి 2010 వరకు స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న కొత్వాల్‌ 2004లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top