‘బహిష్కరణ’ కేసులో మరో మలుపు

Telangana Congress MLAs Suspension Issue Not Ended - Sakshi

సింగిల్‌ జడ్జి తీర్పుపై తాజాగా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శుల అప్పీళ్లు 

అత్యవసరంగా విచారించాలని అభ్యర్థన.. ధర్మాసనం ససేమిరా 

విచారణ ఈనెల 16కి వాయిదా 

10న ధిక్కార పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి విచారణ

సాక్షి, హైదరాబాద్‌: ఆది నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తాము తీర్పునిచ్చినా వారిని శాసనసభ్యుల జాబితాలో చేర్చకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సింగిల్‌ జడ్జి ప్రాథమిక అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు గత ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇప్పుడు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు అప్పీళ్లు దాఖలు చేశారు. ఏప్రిల్‌ 17న సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావు తీర్పునివ్వగా, 61 రోజుల తర్వాత వారు ఈ అప్పీళ్లు దాఖలు చేయడం గమనార్హం. 

కోర్టు తీర్పును పట్టించుకోవద్దన్న వైఖరితో.. 
కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు.. తమకు కోర్టు ధిక్కారం కింద ఫారం–1 నోటీసు జారీ చేసి, వాదనలు విని శిక్షించే అవకాశం ఉందని భావించిన కార్యదర్శులు ఆశ్చర్యకరంగా ఇన్ని రోజుల తర్వాత అప్పీళ్ల మార్గాన్ని ఎంచుకున్నారు. మొదట్లో ఈ కేసులో కోర్టు తీర్పును పట్టించుకోకూడదన్న వైఖరితో వ్యవహరించిన శాసనసభ కార్యదర్శి.. రోజు రోజుకూ పరిస్థితి చేయి దాటుతుండటం, కోర్టు ధిక్కారం విషయంలో జస్టిస్‌ శివశంకరరావు గట్టిగా వ్యవహరిస్తుండటంతో భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే అప్పీల్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గత వారం జరిగిన కోర్టు ధిక్కార పిటిషన్‌ విచారణలో ఇద్దరు కార్యదర్శులు కూడా నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కోరగా.. న్యాయమూర్తి వారం గడువునిచ్చారు. సింగిల్‌ జడ్జి వద్ద తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. 

న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు బుధవారం ఉదయం ఈ అప్పీళ్ల గురించి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సింగిల్‌ జడ్జి ముందు ఈనెల 10న కోర్టు ధిక్కార కేసు విచారణకు వస్తుందని, ఈ కేసులో స్పీకర్‌ను ప్రతివాదిగా చేర్చి నోటీసులిచ్చేందుకు సింగిల్‌ జడ్జి సిద్ధమవుతున్నారని, అందువల్ల ఈ అప్పీళ్లపై అత్యవసర విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం కేసు పూర్వాపరాల గురించి తెలుసుకుంది. అప్పీళ్ల దాఖలులో ఎన్ని రోజుల ఆలస్యం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించింది. 61 రోజుల ఆలస్యం జరిగిందని అదనపు ఏజీ బదులివ్వగా, మరి ఇన్ని రోజుల ఆలస్యంతో అప్పీళ్లు దాఖలు చేసినప్పుడు, అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది.

అత్యవసర విచారణకు నిరాకరించింది. కనీసం గురువారమైనా విచారించాలని అదనపు ఏజీ అభ్యర్థించగా ససేమిరా అన్న ధర్మాసనం, ‘గతంలో అసలు కోర్టుకు విచారణ పరిధి లేదని చెప్పినట్లున్నారు..? ముందు కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోండి. సింగిల్‌ జడ్జి ఫారం–1 నోటీసు జారీ చేస్తే అప్పుడు దానిపై ధిక్కార అప్పీల్‌ దాఖలు చేసుకోండి. పరిస్థితిని బట్టి అప్పుడు విచారణ జరుపుతాం’అని తేల్చి చెప్పింది. కోర్టులిచ్చే తీర్పు విషయంలో ఉదాసీనంగా ఉండరాదంటూ పరోక్షంగా కోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. 61 రోజుల ఆలస్యంగా అప్పీళ్లు దాఖలు చేయడంపై తాము తమ అభ్యంతరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని కోమటిరెడ్డి న్యాయవాది తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top