పీఆర్‌సీ, బదిలీలకు ఓకే..

Telangana CM KCR Given Green Signal To PRC And Transfers Of Employees - Sakshi

ముగ్గురితో పీఆర్సీ కమిషన్‌: సీఎం కేసీఆర్‌

జూన్‌–2న మధ్యంతర భృతి ప్రకటన

పంద్రాగస్టు కానుకగా ఉద్యోగుల వేతన సవరణ

బదిలీలు, పదోన్నతులపై ‘అజయ్‌ మిశ్రా’ కమిటీ

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం చర్చలు

పెండింగ్‌ సమస్యలు, కొత్త విధానాలపై నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మూడ్రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయటంతో పాటు.. శాశ్వత ప్రాతిపదికన బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ‘తెలంగాణ బదిలీల విధానం’ రూపొందిస్తామని ప్రకటించారు. జూన్‌లోనే ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు వీలుగా చర్యలు చేపడుతామని తెలిపారు. వీటితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటల సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను పరిశీలించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో విలేకరుల సమావేశంలో సీఎం ఈ వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు.

ముగ్గురు కమిషనర్లతో కమిషన్‌
ఇప్పటివరకు ఆనవాయితీగా ఉన్న ఏక సభ్య కమిషన్‌కు బదులు కొత్త పీఆర్సీని ముగ్గురు కమిషనర్లతో (త్రిసభ్య కమిషన్‌) వేస్తామని సీఎం వెల్లడించారు. ‘‘గతంలో ఏడాదిపాటు పీఆర్సీ అధ్యయనం చేసేది. ఈసారి అందుకు భిన్నంగా శరవేగంగా పీఆర్సీ అధ్యయన ప్రక్రియ పూర్తి చేసేలా కమిషన్‌కు విధివిధానాలను నిర్దేశిస్తాం. ఆగస్టు 15కు పది రోజుల ముందే పీఆర్సీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించేలా గడువు విధిస్తాం. పంద్రాగస్టు కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తాం. ఈలోపే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త పీఆర్సీ వేయగానే.. వారిచ్చే సిఫారసుల మేరకు జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐఆర్‌ ప్రకటిస్తాం..’’అని చెప్పారు.

బదిలీలకు శాశ్వత విధానం
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాధారణ బదిలీలకు అవకాశమివ్వలేదని సీఎం పేర్కొన్నారు. ‘‘అన్ని సంఘాలు  బదిలీల అవసరముందని విజ్ఞప్తి చేశాయి. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య డీఎస్పీలు తప్ప మిగతా ఉద్యోగుల పంపిణీ దాదాపుగా పూర్తయింది. అందుకే బదిలీలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అవినీతి లేకుండా పారదర్శకంగా, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా బదిలీల ప్రక్రియ జరగాలి. అందుకే స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా అధ్వర్యంలో ముఖ్య కార్యదర్శులు అదర్‌ సిన్హా, శివశంకర్‌ ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ రేపు, ఎల్లుండి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి, ఎప్పట్నుంచి బదిలీల ప్రక్రియ చేపట్టాలి, అవినీతికి తావులేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిస్తుంది.

తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే సిఫారసుల మేరకు బదిలీలకు ఉత్తర్వులు జారీ అవుతాయి. భార్యభర్తలను ఒకే చోటికి బదిలీ చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ముందే బదిలీలు పూర్తి చేస్తాం. జూన్‌ 15లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అనుకుంటున్నాం. బదిలీల్లో ఎక్కడ అవినీతి జరిగినా కఠిన చర్యలుంటాయి. ఇకపై బదిలీలకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఒక విధానం ఉండాలని నిర్ణయించాం. నిర్ణీత గడువు లేదా ప్రతి ఏడాది బదిలీలు చేయాలా.. చేస్తే ఎంత శాతం చేయాలి.. ఇవన్నీ పొందుపరుస్తూ బదిలీ విధానం ఉంటుంది. ఈ బాధ్యతను అధికారుల కమిటీతోపాటు మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించాం. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం’’అని వివరించారు.

సీఎం వెల్లడించిన ముఖ్య నిర్ణయాలివీ..
ఒక డీఏ చెల్లించే ఫైలుపై సంతకం పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు సంబంధించి ఒక కరువు భత్యం (డీఏ)ను వెంటనే చెల్లిస్తాం. ఈరోజే డీఏకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశాను. మరో డీఏను రెండు నెలల్లో చెల్లిస్తాం.  

పదోన్నతులకు విధానం
సంఘాల కోరిక మేరకు ఉద్యోగుల పదోన్నతుల అర్హతకు రెండేళ్ల సీనియారిటీ ఉండేలా ఇచ్చిన వెసులుబాటును మరో ఏడాది పొడిగిస్తాం. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి ఒక విధానం రూపొందిస్తాం. పైరవీలతో ప్రమోషన్లు చేసుకోవాల్సి వస్తోంది. ఆరోపణలున్న ఉద్యోగులకు తప్ప తప్పు చేయని ఉద్యోగులందరికీ పదోన్నతులు రావాలి. ఏ హోదాలో ఉన్న ఉద్యోగికి ఎప్పుడు ప్రమోషన్‌ వస్తుందో తెలియాలి. అందుకు వీలుగా ఇప్పుడున్న లొసుగులన్నీ తొలిగించి పారదర్శకంగా విధానం తయారు చేయాలి.

మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవు
మహిళా ఉద్యోగులకు ఏడాదికి 5 రోజుల ప్రత్యేక సెలవు ఇస్తాం. ఉద్యోగుల ఎల్‌టీసీకి సంబంధించి నిర్దిష్టమైన విధానం రూపొందిస్తాం. ఇప్పుడున్న ఎల్‌టీసీ విధానం గందరగోళంగా ఉంది. దుర్వినియోగమవుతుందనే ఫిర్యాదులున్నాయి.

విదేశాలకు వెళ్లినా సరే..
ప్రతి ఉద్యోగికి ఎల్‌టీసీ (లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇకపై బస్‌ టికెట్లు, బిల్లులు పెట్టే పద్ధతి ఉండదు. ప్రతి ఉద్యోగి ఏటా ఈ సదుపాయం వినియోగించుకునేలా విధానం ఉంటుంది. ఏటా లేదా మూడేళ్లకోసారి విదేశాలకు వెళ్లినా సరే. ఈ సదుపాయం వినియోగించుకునేలా ఓ నిర్ణీత విధానం ఖరారు చేస్తాం.

రిమోట్‌ ఏరియా అలవెన్స్‌
ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌ఆర్‌ఏ చెల్లింపుల్లో లోపాలున్నాయి. మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లేదు. అందుకే మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి ప్రత్యేక అలవెన్స్‌ ఇస్తాం. ఏయే ప్రాంతాలు మారుమూలన ఉన్నాయి.. ఎక్కడ పని చేసే వారికి ఎంత అలవెన్స్‌ ఇవ్వాలనేది పీఆర్సీ అధ్యయనం చేసి వెల్లడిస్తుంది.

పకడ్బందీగా ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌
ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న హెల్త్‌ స్కీమ్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తాం. దీనికి ప్రత్యేకంగా హెల్త్‌ స్కీమ్‌ విధానం రూపొందిస్తాం.

10 రోజుల్లో కారుణ్య నియామకాలు
ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబీకులకు ఇచ్చే కారుణ్య నియామకాలు పది రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. రిటైరైన ఉద్యోగులను సాదరంగా వీడ్కోలు పలకాలి. ప్రభుత్వం తరఫున అందించే పెన్షన్‌ బెనిఫిట్‌ ప్యాకేజీని అందించి సత్కరించాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటి వద్ద దింపి రావాలి. ఇప్పటికే ఈ ఉత్తర్వులిచ్చాం. కానీ పాక్షికంగా అమలవుతోంది. పూర్తిస్థాయిలో అమలయ్యేందుకు ఆదేశాలు జారీ చేస్తాం.

సీపీఎస్‌ ఉద్యోగులకు డెత్, రిటైర్‌మెంట్‌ గ్రాట్యుటీ
సీపీఎస్‌ ఉద్యోగులకు తమకు రావాల్సిన బెనిఫిట్స్‌ రావనే అనుమానాలున్నాయి. వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నంత మేరకు ప్రయోజనం కల్పిస్తాం. డెత్, రిటైర్‌మెంట్‌ గ్రాట్యుటీని చెల్లిస్తాం. త్వరలోనే ఈ ఉత్తర్వులు జారీ అవుతాయి.

ఏకీకృత సర్వీసులపై న్యాయపోరాటం
ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీసులు చిన్న మెలికతో ఆగిపోయాయి. ప్రభుత్వమే వారి తరఫున న్యాయపోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టులో ప్రత్యేక న్యాయవాదిని పెట్టి వాదనలు వినిపిస్తుంది.

భాషా పండితులు, పీఈటీలపై..
భాషా పండితులు, పీఈటీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాం. ఎయిడెడ్‌ టీచర్లు, అధ్యాపకులకు సంబంధించి నెలల తరబడి జీతాలు రావడం లేదనే ఫిర్యాదులున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర విధానం రూపొందిస్తాం.

జోనల్‌ విధానంపై చర్చలు
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడున్న జోనల్‌ విధానంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అందించి అభిప్రాయాలు తీసుకుంటాం. తదుపరి తుది నివేదికను కేబినెట్‌ ఆమోదంతో రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top