
బదిలీ చేసిన చోట చేరడానికి సచివాలయాల ఉద్యోగులకు రాజకీయ ఇబ్బందులు
ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వద్దన్నారంటూ చాలాచోట్ల విధుల్లో చేర్చుకోని దుస్థితి
దివ్యాంగులకు సైతం తప్పని తిప్పలు
పోస్టింగ్ కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో పని చేస్తున్న దివ్యాంగ కేటగిరీకి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్‌ను ఇబ్రహీంపట్నం మండలంలోని ఒక గ్రామ సచివాలయానికి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. అక్కడ విధుల్లో చేరేందుకు ఆయన రెండు రోజుల కిందట వెళ్లారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలో వేచి ఉన్నా, ఆయన నుంచి జాయినింగ్ రిపోర్టు తీసుకోలేదు. కారణం అడిగితే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని సచివాలయ సిబ్బంది బదులిచ్చారు.
ఈ విషయాన్ని సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తే... మరోచోటకు బదిలీ చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సచివాలయాల ఉద్యోగులు ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం ఆదేశాలు లేకపోతే ఉద్యోగులు విధుల్లో కూడా చేరలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వారం కిందటే బదిలీల ప్రక్రియ ముగిసినా...
సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారికంగా వారం రోజుల కిందటే ముగిసింది. సినియారిటీతో సంబంధం లేకుండా అధికార పార్టీ నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని వేలాది మంది ఉద్యోగులను ఇష్టానుసారం బదిలీ చేశారు. అయితే, బుధవారం నాటికి కూడా చాలాచోట్ల బదిలీ అయిన స్థానాల్లో ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవడం లేదు.
తమను ఎందుకు విధుల్లో చేర్చుకోవడం లేదని సచివాలయాల ఉద్యోగులు ప్రశ్నిస్తే... ‘మిమ్మల్ని చేర్చుకోవద్దని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది’ అంటూ అక్కడ పనిచేసే తోటి పర్యవేక్షణ సిబ్బంది బదులిస్తున్నారు. దీంతో వివిధ కేటగిరీలకు చెందిన వందలమంది ఉద్యోగులు తమ బదిలీల ఉత్తర్వుల కాపీలను పట్టుకొని పోస్టింగ్‌ల కోసం జిల్లా శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో దివ్యాంగులు కూడా ఉన్నారు. అధికార పార్టీ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం సచివాలయ ఉద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.