అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ప్రతిభ కనబరిచిన తెలంగాణ, హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారులను తెలంగాణ శాసనసభ అభినందించింది.
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ప్రతిభ కనబరిచిన తెలంగాణ, హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారులను తెలంగాణ శాసనసభ అభినందించింది. ఈమేరకు మంత్రి కె.తారకరామారావు మంగళవారం సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. సైనా నెహ్వాల్, శ్రీకాంత్, చక్రవర్తి, అంబటి రాయుడు, సానియా మీర్జాలు ఇటీవల అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తెచ్చారని, వారు ఇదే తరహాలో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత విజయాలకు తెలంగాణ రాష్ట్రం పక్షాన అభినందనలు తెలుపుతున్నట్టు తీర్మానంలో పేర్కొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి.
బీజేపీ, సీపీఐ, ఎంఐఎం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రవీంద్రకుమార్, అక్బరుద్దీన్, బాలరాజు తదితరులు మాట్లాడారు. మార్షల్‌ఆర్ట్స్‌లో తైక్వాండో తప్ప మిగతా క్రీడలకు గుర్తింపు లేదని, వాటికి ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రీడాకారులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. స్పాన్సర్‌షిప్‌కోసం కార్పొరేట్ సంస్థల చుట్టూ తిరక్కుండా చర్యలు చేపట్టాలని, కోచ్‌లకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
మండలాల్లో క్రీడాప్రాంగణాలు:ఉపముఖ్యమంత్రి రాజ య్య
ఐదారెకరాల భూమి లభిస్తే మండలాల్లో రూ. 1.60 కోట్లతో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. గతంలో కంటే అధికంగా రూ. 166 కోట్లను క్రీడారంగానికి కేటాయింమన్నారు. రూ. 99 కోట్లతో 61 కొత్త స్టేడియంల నిర్మాణాలు, 46 పాత స్టేడియంల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.