టీచర్లకూ గ్రేడింగ్ | teachers grading and direct recruitment | Sakshi
Sakshi News home page

టీచర్లకూ గ్రేడింగ్

Apr 11 2016 1:00 AM | Updated on Sep 3 2017 9:38 PM

పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు కూడా పనితీరు సూచికలు (పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

 పనితీరు సూచికల ఆధారంగానే పదోన్నతులు
 డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా హెచ్‌ఎం, ఎంఈవో పోస్టులు
 అమలుకు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించిన కేంద్రం
 ఆ దిశగా రాష్ట్రంలోనూ చర్యలకు విద్యాశాఖ కసరత్తు
 వచ్చే విద్యా సంవత్సరంలో పక్కాగా అమలు

 
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు కూడా పనితీరు సూచికలు (పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధ్యాయుల బోధన తీరు ఎలా ఉంది? విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారా? తదితర అంశాలపై ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేయనున్నారు. అంతేకాదు విద్యార్థులు ఏం నేర్చుకున్నారన్న దాన్ని పరీక్షించేందుకు లెర్నింగ్ ఇండికేటర్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు పని తీరు సూచికలు ఇవ్వాలని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేస్తోంది.
 
 విద్యా బోధనపై దృష్టి పెట్టని టీచర్లు
 పాఠశాలల్లో విద్యా బోధన ఎలా సాగుతుందన్న అంశంపై గతంలో విద్యాశాఖ రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అంతర్గత సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బోధన సరిగ్గా జరగడం లేదన్న నిర్ణయానికి వచ్చింది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని ముందుమాట చదివి బోధన చేపట్టాల్సి  ఉంటుంది. కాని వాటిని చదివి అర్థం చేసుకొని పాఠాలు బోధిస్తున్న వారు 20 శాతం మంది మాత్రమే ఉన్నట్లు అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో పనితీరు సూచికలు ప్రవేశ
 పెట్టాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చింది.
 
 ప్రతిభ, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతుల్లో ప్రాధాన్యం
 టీచర్ల ప్రతిభా ప్రదర్శన, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలని భావిస్తోంది. దీనికోసం అవసరమైన నియమావళి రూపకల్పనపై దృష్టి పెట్టింది. అంతేకాదు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో పోస్టులను డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ విధానం కర్ణాటకలో అమల్లో ఉంది. ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నిర్వహణ, నాయకత్వంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. కొత్తగా టీచర్లుగా నియమితులైన వారు పాఠశాలల్లో విధుల్లో చేరడానికంటే ముందే ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో వారికి ఆరు నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వాలని భావిస్తోంది.
 
 పనితీరు అంచనాలో పరిగణనలోకి తీసుకునే ప్రధాన అంశాలు
 - తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనకు ముందు ఏం చేయాలి. ఏం చేస్తున్నారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
 - పిల్లల ప్రగతి వివరాలను తెలుసుకొని తగిన చర్యలు చేపట్టేందుకు ఆన్‌లైన్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దానిద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తక్షణ చర్యలు చేపడతారు.
 - టీచర్లకు సబ్జెక్టుపై, సోపానాల ప్రకారం బోధించడంపై శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.
 - ప్రతి నెలా సబ్జెక్టుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వృత్తి పరమైన నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement