భర్తీ ప్రక్రియ షురూ.. 

Teacher Posts Counselling Started In Mahabubnagar - Sakshi

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 374 మంది

ఎంపికైన వారికి మాత్రమే పిలుపు 

8 మంది గైర్హాజరు  

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎంతో కాలంగా టీఆర్టీ అభ్యర్థులు ఎదురుచూసిన ఘడియ రానేవచ్చింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మొదటి ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రతిపాధికన భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంతో పాటు, డైట్‌ కళాశాలలో వివిధ సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్, లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. ప్రస్తుతం కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు మాత్రమే పిలుపువచ్చింది. తదుపరి ప్రభుత్వం ప్రకటించే షెడ్యూల్‌ ప్రకారం ఎస్టీటీలకు నిర్వహించనున్నారు.  

374 పోస్టులకు కసరత్తు 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1,979 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో భాగంగా మొదట 374 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. టీఆర్టీ పరీక్షలో మొత్తం 50వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో కేవలం కొంతమంది మాత్రమే అర్హత సాధించారు. వారికి మాత్రమే వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన వెరిఫికేషన్‌కు 8 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.   

సబ్జక్టుల వారీగా.. 
స్కూల్‌ అసిస్టెంట్, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల వెరిఫికేషన్‌ జరిగిన క్రమంలో 374 పోస్టుల్లో వివిధ సబ్జెక్టుల వారీగా ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో పోస్టులు, తెలుగు పండిట్‌ 67 పోస్టులు, లాంగ్వేజ్‌ పండిట్‌ ఉర్దూలో 4 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో గణితం 36, సోషల్‌ 139 పోస్టులు, ఉర్దూ పోస్టులు 6, ఇంగ్లీష్‌ 17, ఫిజికల్‌ సైన్స్‌ 23, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు 44, జీవశాస్త్రం 41 పోస్టులు ఉన్నాయి. వీరి వెరిఫికేషన్‌ అనంతరం 15లోగా వివిధ స్థానాల్లో భర్తీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు.   

13న ఖాళీల వివరాల ప్రదర్శన 
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జిల్లా అధికారులు ప్రభుత్వం సూచించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అభ్యర్థులకు 1.3 రెషియో ప్రకారం గతంలో ఒకమారు నిర్వహించిన వారిలో పూర్తిస్థాయి అర్హత సాధించిన వారికి గురువారం ఒకమారు నిర్వహించారు. అనంతరం వివిధ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు ఏయే  పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయన్న అంశంపై గురువారం సాయంత్రంలోగా, శుక్రవారం ఉదయం లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీల వివరాలను ప్రదర్శించాల్సి ఉంది. అభ్యర్థులకు ఖాళీలను ఎంపిక అనంతరం ఈనెల 13న కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. తర్వాత ఈనెల 15న కలెక్టర్‌ ఆధ్వర్యంలో వారికి భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top