దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి: మంత్రి తుమ్మల

TDP And CPI Leaders Join In TRS Khammam - Sakshi

మధిర (ఖమ్మం): రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు రావూరి శివనాగకుమారితో పాటు సీపీఎం, టీడీపీ  పార్టీలకు చెందిన 350 కుటుంబాల వారు శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. మాటూరుపేటలో శనివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే మాటూరు, మాటూరుపేట  గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేశామని, తిరిగి అధికారంలోకి రాగానే అన్ని లింకు రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరుచేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచేందుకు అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారని తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లింగాల కమల్‌రాజ్‌ గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కమల్‌రాజ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే  సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు.

పెండింగ్‌లో ఉన్న మాటూరుపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లోగా మంజూరు చేయడంతో పాటు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. పార్టీలో చేరినవారిలో మాజీ సర్పంచ్‌ తోట కృష్ణయ్య, రావూరి రామారావు, మార్తమ్మ, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్‌ బుడాన్‌బేగ్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బొమ్మెర రామ్మూర్తి, మధిర నియోజకవర్గ టీఆర్‌స్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, బోగ్యం ఇందిర తదితరులు పాల్గొన్నారు.

ఖిల్లాపై మళ్లీ టీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి 
ఖమ్మంమయూరిసెంటర్‌: టీఆర్‌ఎస్‌ ఖమ్మం నియోజకవర్గ ప్రచార వాహనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ డివిజన్లలో ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు, అభ్యర్థి తిరిగే ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఖమ్మం ఖిల్లాపై మళ్లీ టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు. జిల్లాలో అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని, ఖమ్మంతోనే గెలుపుబాట మొదలు కానున్నదని, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం ప్రజలు చెబుతారని పేర్కొన్నారు.

అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తనకు మళ్లీ అవకాశం కల్పించాలని ఖమ్మం ప్రజలను కోరారు. మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలుపుకున్నానని, దానిని కొనసాగించాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఎస్‌ఐడీసీ చైర్మన్‌ బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top