భళా.. తమిళ ఫార్ములా! 

Tamil Nadu Formula To Prevent Road Accidents - Sakshi

రోడ్డు ప్రమాదాల నివారణకు తమిళనాడు తరహా ప్రత్యేక సెల్‌

ట్రామాకేర్‌కు పెద్దపీట.. 24 గంటలూ అందుబాటులో వైద్యసేవలు

అక్కడి విధానాన్ని అధ్యయనం చేసిన తెలంగాణ పోలీసుశాఖ

ప్రధాన విభాగాలతో కమిటీ.. విధానం అమలుకు సీఎం పచ్చజెండా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగం గా తమిళనాడు తరహాలో ప్రత్యేక విధానాన్ని తెలం గాణలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఈ విధానంలో తమిళనాడులో చాలావరకు సత్ఫలితాలిచ్చా యి. ఫలితంగా అక్కడ దాదాపు 35 శాతానికి పైగా రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయి. అక్కడ విజయవంతమైన ఈ విధానాన్ని తెలంగాణ పోలీసులు అధ్యయనం చేశారు. దీనిపై ఇటీవలే సీఎస్‌కు నివేదిక సమర్పించారు. అది సీఎం వద్దకు వెళ్లడం, ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో ఇక్కడా అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మన వద్ద ప్రమాదాలకు కారణాలివే..
ప్రమాదాల నివారణే లక్ష్యంగా తమిళనాడు విధానం అమలు చేయబోతున్నామని చెబుతోన్న పోలీసు ఉన్నతాధికారులు.. త్వరలోనే అక్కడి తరహాలో ప్రత్యేక కమిటీని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారణమవుతోన్న బ్లాక్‌స్పాట్లను గుర్తించడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర సేవలు 24 గంటలూ అందుబాటులోకి తెస్తామని అంటున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అత్యధిక ప్రమాదాలకు తొలి కారణం అతి వేగమైతే, రెండో కారణం బ్లాక్‌ స్పాట్లు (తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు). 

మూలమలుపుల వద్ద రోడ్లకు గట్టుకోణం (సూపర్‌ ఎలివేషన్‌.. దాదాపు 7 డిగ్రీలు) ఏర్పాటు చేయకపోవడం, ప్రమాద హెచ్చరికలు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.

రాష్ట్రంలో గుర్తించిన బ్లాక్‌స్పాట్లలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి డెయిరీఫాం, బేగంపేట ఎయిర్‌పోర్టు వెనక ప్రమాదకర మలుపు, రైల్‌నిలయం రోడ్డు అత్యంత ప్రమాదకరమైనవి.

తరచూ ప్రమాదాలు జరిగే ఈ ప్రాంతాల్లో రహదారి లోపాలు సవరించి,  చిన్నపాటి మరమ్మతులు చేశారు. దీంతో ఇక్కడ చాలాకాలంగా ప్రమాదాలు దాదాపు జరగడం లేదని పోలీసులు చెబుతున్నారు. 

అక్కడ ఏం చేశారు.. 
వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు జరగ్గానే.. దాన్ని పోలీసుల పనిగానో లేదా ఆరోగ్యవిభాగం పనిగానో చూస్తారు. రోడ్డు ప్రమాదాలు, మరణాల నివారణ కేవలం వీరి వల్ల మాత్రమే సాధ్యం కాదు. మిగతా అన్ని విభాగాలూ కలిసి వచ్చినపుడే అది సాధ్యమవుతుందన్న విషయా న్ని తమిళనాడు గుర్తించింది. అనుకున్నదే తడవుగా పోలీసులతో పాటు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల అధికారులను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేసింది. దీనికి నేతృత్వం వహించేందుకు కమిషనర్‌ను నియమించింది. ఈ కమిటీ మొదట తమిళనాడులో తరచుగా ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్స్, ప్రమాదకర మలుపులను గుర్తించి వాటిని సరిచేసింది.

ప్రమాదాలు జరిగిన తరువాత ‘గోల్డెన్‌ అవర్‌’కు ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో మరణాలను తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలను ఏర్పాటు చేసింది. ట్రామాకేర్‌ సదుపాయాలతో కూడిన అత్యవసర విభాగాలను 24 గంటలూ అందుబాటులో ఉంచింది. ప్రమాదం జరిగిన తరవాత జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలు రంగంలోకి దిగి రోడ్లలోని లోపాలను గుర్తించేవి. ఆ మేరకు ఆయా రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టేవారు. అలా రోడ్డు ప్రమాదాలను 35 శాతానికిపైగా అరికట్టగలిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top