కార్యదక్షుడు జస్టిస్‌ సుభాష్‌రెడ్డి

Supreme Court Former Judge Justice Jeevan Reddy about Justice Subhash Reddy - Sakshi

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: కార్యదక్షుడు కాబట్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి నియమితులయ్యారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.పి.జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆర్టీసీ కల్యాణ మండపంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్స్‌ తెలంగాణ ఆధ్వర్యంలో న్యాయవాదుల మహాసమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సుభాష్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తిగా సమర్థవంతంగా పనిచేయడం వల్లనే గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుభాష్‌రెడ్డి నియమితులయ్యారని అన్నారు.

అక్కడ కూడా తన సత్తాను నిరూపించుకోవడంతోపాటు ఆయన ఇచ్చిన తీర్పుల వల్ల మంచి గుర్తింపు రావడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారని కితాబిచ్చారు. సుప్రీంకోర్టులో కూడా సుభాష్‌రెడ్డి తనదైన శైలిలో మంచి తీర్పులు ఇచ్చి గుర్తింపు పొందుతారని ఆశాబావం వ్యక్తం చేశారు. మాజీ లోకాయుక్త జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి మాట్లాడుతూ.. అంకితభావం, కార్యదీక్షతో కష్టపడి పనిచేసి సుభాష్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారని కితాబిచ్చారు. గుజరాత్‌ ప్రధాన న్యాయమూర్తిగా విజయవంతం కావడం వల్లనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ఆలస్యం అయినప్పటికీ తక్కువ సమయంలో ఎన్నో మంచి తీర్పులు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టు జడ్జీగా ఐదేళ్ల నాలుగు నెలల కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారని.. ఆ తీర్పులను ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. 

రాష్ట్రానికి గుర్తింపు తెస్తా: జస్టిస్‌ సుభాష్‌రెడ్డి 
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను గ్రామీణ వాతావరణం నుంచి వచ్చానని, ఇంటర్‌లో తెలుగు మీడియం చదివినప్పటికీ డిగ్రీలో ఇంగ్లిష్‌ మీడియంలో చేరానని చెప్పారు. బాగా కష్టపడి పనిచేయడంతో పాటు పెద్దల ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. గుజరాత్‌ ప్రధాన న్యాయమూర్తిగా మంచి గుర్తింపు వచ్చిందని ఇంకా బాగా కష్టపడి పనిచేసి మన రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకొస్తానని అన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ తెలంగాణ అధ్యక్షులు అనంతరెడ్డి, హరిమోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, బార్‌ కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, రాజేందర్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు అనంతసేనరెడ్డి, అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.బాలరాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జితేందర్‌రెడ్డి, బి.జయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top