నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఏజెన్సీ...

 The Sun Is Burning In June - Sakshi

సాక్షి, ఖమ్మం(చర్ల): జూన్‌ నెలలోనూ ఎండలు మండిస్తున్నాయి. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే వాటి ప్రతాపాన్ని చూపించేవి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే మండించడం ప్రాంభమైన ఎండలు మార్చి, ఏప్రిల్, మే నెలలతో పాటు జూన్‌ నెలలోనూ మండిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడిస్తూ ఉండగా సాయంత్రం 6 గంటల వరకూ తీవ్రతను అలాగే కొనసాగిస్తున్నాడు. జూన్‌ మొదటి నుంచే ప్రారంభం కావాల్సిన పాఠశాలలు వేసవి తీవ్రత నేపధ్యంలో ప్రభుత్వం జూన్‌ 11 వరకు పొడిగించి 12 నుంచి పాఠశాలలను తెరవాలంటూ ఆదేశించడంతో అదే విధంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. 12 నాటికి కూడా ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గక పోగా రెట్టింపయ్యింది. ఈ క్రమంలో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు ఎండలతో అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తరువాత ఎండ తీవ్రతతో మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్నీ ప్రధాన గ్రామాలలో రహదారులు నిర్మాణుష్యంగా మారుతున్నాయి.

వివిధ పనుల కోసం భయటకు వచ్చే వారు ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. పెంచన్లు కోసం బ్యాంకులకు వస్తున్న వృద్దులు, వితంతువులు, వికలాంగులు ఈ ఎండలకు బ్యాంకుల వద్ద సొమ్మసిల్లి పడుతున్నారు. ఎండల తీవ్రత తగ్గేంత వరకు పాఠశాలలకు సెలవులు పొడగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని బోనకల్‌లోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలలో నెహ అనే 14 ఏళ్ల విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన కూడా జరిగింది. పాఠశాలల పునః ప్రారంభమైన రోజు నుంచి కూడా ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండడంతో విద్యార్థులు పాఠశాలల్లో తీవ్ర ఆసౌకర్యానికి గురవుతున్నారు. అయినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా అలాగే తరగతులను కొనసాగిస్తోంది. పాఠశాలల్లో విద్యార్థులు హాజరు శాతం చాలా స్వల్పంగానే నమోదవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top