రోడ్డెక్కిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

Students Protest For Teachers  - Sakshi

పెద్దవూర(నాగార్జునసాగర్‌) : తరగతులు సక్రమంగా నిర్వహించాలని మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై మంగళవారం రోడ్డెక్కి గంటకు పైగా రాస్తారోకో నిర్వహిం చారు. 2015 నవంబర్‌ 1వ తేదీన జిల్లాలోని ఆరు గిరిజన వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏర్పాటు చేశారు. దశల వారీగా ఈ యేడాది 10వ తరగతి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 258 మంది విద్యార్థులు ఉన్నారు.

వీరందరికి ప్రభుత్వం రూ.5వేల వేతనంతో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్లర్లను నియమించి పాఠశాలలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో పనిచేస్తున్న అకడమిక్‌ ఇన్‌స్ట్రక్లర్లు(పార్ట్‌టైం టీచర్లు) వేతనాలు పెంచాలని ఈ నెల 2,3,4 తేదీల్లో సమ్మెలో పాల్గొని చాక్‌డౌన్‌ నిర్వహించారని తెలిపారు. ఈ మూడు రోజులు తమకు పాఠాలు బోధించలేదని దీంతో తరగతుల్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సమ్మె విరమించినా తమ సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిపారు.

ఏటీడీనో, పాఠశాల హెచ్‌ఎం పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య ఇలా ఉందని మీరు వేరే పాఠశాలకు వెళ్లండని తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఇక్కడ చదివి పాఠశాల ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఎలా వెళ్తామని, ఈ పాఠశాల నుంచి వెళ్లేది లేదని, సక్రమంగా తరగతులను నిర్వహించాలని పాఠశాల నుంచి ప్రధాన సెంటర్‌కు వెళ్లి రాస్తారోకోకు దిగారు. ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాలని, పాఠశాల పనిదినాల్లోనే తరగతులు నిర్వహించాలని, పార్ట్‌టైం కాకుండా ఫుల్‌టైం విధులు నిర్వహించేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

విషయం తెలుసుకున్న ఎంఈఓ తరి రాము సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఉపాధ్యాయులు సక్రమంగా రావడం లేదని, పాఠ్యాం శాలు సరిగా కావడం లేదని, పాఠశాలకు వచ్చినా పాఠ్యాంశాలు బోధించడం లేదని, ఈ పాఠశాలలోనే ఉంటామని, వేరే పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో వెళ్లమని, సక్రమంగా పాఠాలు నిర్వహించేలా చూడాలని తహసీల్దార్‌కు విన్నవించారు.

తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చిన ఏటీడీఓ జటావత్‌ లాల్‌సింగ్‌ విద్యార్థులతో మాట్లాడి సర్దిచెప్పి పాఠశాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఇకనుంచి సక్రమంగా తరగతులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top