వృద్ధ వికలాంగుడి ఆకలిచావు | starvation death in vanaparthi | Sakshi
Sakshi News home page

వృద్ధ వికలాంగుడి ఆకలిచావు

Apr 23 2015 6:44 PM | Updated on Sep 3 2017 12:45 AM

గత కొన్ని రోజులుగా సక్రమంగా ఆహారం లేక ఒంటరిగా నివాసం ఉంటున్న ఓ వృద్ధవికలాంగుడు ఆకలితో మృత్యుఒడికి చేరిన హృదయ విదారక సంఘటన గురువారం వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో వెలుగు చూసింది.

వనపర్తి : గత కొన్ని రోజులుగా సక్రమంగా ఆహారం లేక ఒంటరిగా నివాసం ఉంటున్న ఓ వృద్ధవికలాంగుడు ఆకలితో మృత్యుఒడికి చేరిన హృదయ విదారక సంఘటన గురువారం కరీంనగర్ జిల్లా వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య(70)  అనే వృద్ధుడు వికలాంగుడు కావటంతో పని చేయలేక ఇంటివద్దే ఉండేవారు. భార్య మూడేళ్ల క్రితం మృతి చెందటం, కుమారుడు బుచ్చన్న జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లడంతో గ్రామంలోని తన సొంత ఇంట్లో ఒంటరిగా ఉండేవారు.

కొడుకు బుచ్చన్న తండ్రిని తనతో పాటు హైదరాబాద్‌కు రమ్మని పిలిచినా తనకు చిన్ననాటి నుంచి అలవాటైన స్వగ్రామాన్ని విడిచి రానని తేల్చి చెప్పాడు. సమయానికి భోజనం వండిపెట్టే వారు లేక గత కొంత కాలంగా లక్ష్మయ్య నీరంగా కనిపించే వారని గ్రామస్తులు తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలు వృద్ధుడి నీరసాన్ని గమనించి కొంత అన్నం పెడితే తినేవారని, అన్నం పెట్టమని అడగలేని ఆత్మగౌరవం గల వ్యక్తి లక్ష్మయ్య అని గ్రామస్తులు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువకావటం, ఆహారం తీసుకోకపోవటంతో మృతుని ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అతని పరిస్థితిని చూసిన చుట్టుపక్కల వారు పాలు తాగించేందుకు ప్రయత్నించగా వృద్ధుడు పాలు తాగుతూనే ప్రాణాలు వదిలేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది

పరామర్శించిన ఎమ్మెల్యే
విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి. చిన్నారెడ్డి ఆహారంలేక మృతి చెందిన లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వృద్ధులైన తల్లితండ్రులను వెంటే ఉంచుకోవాలన్నారు. మృతుని కుటుంబానికి ఎన్‌ఎఫ్‌బీఎస్ తక్షణ సాయం రూ. 5 వేల అందజేయాలని తహశీల్దార్‌కు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement