స్పీడ్‌ ప్రాజెక్ట్‌

Speed Project In First Time Hyderabad Fly Over Bridge Compleat - Sakshi

16 నెలల్లో ఫ్లై ఓవర్‌ పూర్తి

కామినేని జంక్షన్‌ వద్ద నిర్మాణం  

నేడు ప్రారంభించనున్నమంత్రి కేటీఆర్‌

ఈ ప్రాంతంలో తగ్గనున్న ట్రాఫిక్‌ చిక్కులు

ఎస్సార్‌డీపీలో మొట్టమొదటి వంతెన ఇదే..  

పొడవు 940 మీ.. ఖర్చు రూ.49 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం కోసం ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన మొదటి ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. దేశంలోనే మొదటిసారి కేవలం ఫౌండేషన్స్‌ తప్ప.. మిగతా పనులన్నీ రెడీమేడ్‌ (ప్రీ ఫ్యాబ్రికేటేడ్‌)గా కామినేని వద్ద (ఎడమవైపు) ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టి కేవలం 16 నెలల్లోనే పూర్తి చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రెండు నుంచి రెండున్నరేళ్లు పడుతోంది. టెండరు మేరకు.. ఈ వంతెనను సంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాల్సి ఉండగా, నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పనులను దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టు సంస్థ బీఎస్‌సీపీఎల్‌ ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌’ వైపు మొగ్గు చూపింది. ఖర్చు 20 శాతం అధికమైనా తామే భరిస్తామనడంతో ప్రభుత్వం అంగీకరించింది. వివిధ ప్రాజెక్టుల్లో స్తంభాలపైన ఉండే పియర్‌ క్యాపింగ్‌ సెగ్మెంట్లు, గర్డర్లకు మాత్రం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ను వినియోగిస్తున్నారు. స్తంభాలకు కూడా ప్రీకాస్టింగ్‌ వాడడం ఇదే ప్రథమం. ‘ప్రీకాస్ట్‌ అండ్‌ పోస్ట్‌ టెన్షన్డ్‌ టెక్నాలజీ’గా వ్యవహరించే ఈవిధానంతో ఫ్లై ఓవర్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. కాగా దీనిని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. 

ఇదే పద్ధతిలో మరో 14 నిర్మాణం  
చైనా, జర్మనీ వంటి దేశాల్లో ఎంతోకాలంగా అనుసరిస్తున్న ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ విధానాన్ని నగరంలో అమలు చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఎండీ బొల్లినేని శీనయ్య ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వం ప్రోత్సహించడంతో తాము చేపట్టనున్న మరో 14 ఫ్లై ఓవర్లను సైతం ఇదే పద్ధతిలో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. కామినేని జంక్షన్‌ పరిసరాల్లోని మిగతా ఎస్సార్‌డీపీ పనులు కూడా పూర్తయ్యాక ట్రాఫిక్‌ సమస్యలు 89 శాతం తగ్గుతాయని జీహెచ్‌ంసీ చీఫ్‌ ఇంజినీర్‌(ప్రాజెక్టŠస్‌) ఆర్‌.శ్రీధర్‌ తెలిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌.. పర్యావరణ పరంగానూ మేలైనదన్నారు. ట్రాఫిక్‌ సమస్యలతో పాటు ధ్వని కాలుష్యం, జంక్షన్‌ వద్ద విరామ సమయం తగ్గుతుందన్నారు. ప్రజలకు ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతాయని ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బి.మల్లికార్జునయ్య వివరించారు. కొత్త టెక్నాలజీతో ప్రయోగం సాహసమే అయినా ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. 

రూ.448 కోట్లతో ప్యాకేజీ–2 పనులు
ఎస్సార్‌డీపీ మొదటి దశ ప్యాకేజీ–2లో భాగంగా  ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల నాలుగు జంక్షన్ల (ఎల్‌బీనగర్, కామినేని, చింతల్‌కుంట, బైరామల్‌గూడ) వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు నిర్మించనున్నారు. వీటికి మొత్తం వ్యయం రూ. 448 కోట్లుగా అంచనా వేశారు. 

తగ్గనున్న ట్రాఫిక్‌ చిక్కులు  
ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్‌తో పాటు ప్యాకేజీ–2 పనులు పూర్తయితే కామినేని జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ చిక్కులు దాదాపు తొలగిపోతాయి. శ్రీశైలం, శంషాబాద్, ఒవైసీ ఆస్పత్రి, విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్, ఉప్పల్‌ వైపు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుంది. కుడివైపు ఫ్లై ఓవర్‌ పనులు జరగాల్సి ఉన్నందున అది పూర్తయ్యేంత వరకు    ఈ ఫ్లైఓవర్‌ను ప్రస్తుతానికి సికింద్రాబాద్, ఉప్పల్‌ వైపు  నుంచి ఒవైసీ, శంషాబాద్‌ వైపు వెళ్లే వారి కోసం వినియోగించనున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కృష్ణారావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top