ఓ మై గాడ్‌..కోవిడ్‌

Special Ward in Gandhi Hospital For COVID 19 Patients - Sakshi

24 ఏళ్ల యువకునికి పాజిటివ్‌గా నిర్ధారణ

గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స

తొలుత అపోలో ఆస్పత్రిలో చికిత్స..ఆ తర్వాత గాంధీకి

గాంధీ, ఛాతి, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు

ప్రత్యేక ఐసీయూలు, వార్డులు, లిఫ్టులు సైతం

వైద్యులు, సిబ్బందికి సెలవులు రద్దు

ప్రపంచ దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండావిజృంభిస్తున్న కోవిడ్‌ వైరస్‌ తెలంగాణలోనూ ప్రవేశించింది.విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌ టెస్ట్‌లడొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ దుబాయ్‌ నుంచి బెంగళూరుకు..అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి చేరింది. నగరంలోని మహేంద్రహిల్స్‌కు చెందిన యువకునికి (24) కోవిడ్‌–19 వైరస్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ కావడం, గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్సలు అందిస్తున్నారని కేంద్ర వైద్యశాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించడంతో గ్రేటర్‌వాసుల్లో ఆందోళనమొదలైంది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

సాక్షి, హైదరాబాద్‌/గాంధీ ఆస్పత్రి: గతకొద్ది కాలంగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్‌–19(కరోనా వైరస్‌) ప్రభావం గ్రేటర్‌ హైదరాబాద్‌పై పడింది. 2019 నవంబర్‌లో చైనాలోని వూహాన్‌ నగరంలో వెలుగు చూసిన ప్రమాదకరమైన ఈ వైరస్‌ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 54 దేశాలకుపైగా విస్తరించింది. వేలాది మంది మృత్యువాతకు కారణమైంది. మన దేశంలోని కేరళలోనూ మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీ సహా హైదరాబాద్‌లోనూ కేసులు నమోదవడంపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల రిత్యా కేవలం నగరం నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చైనా సహా సమీప దేశాలకు వెళ్లిన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. (చదవండి: రాష్ట్రంలో కోవిడ్‌ కలకలం)

వారందరినీ స్వస్థలాలకు తిరిగి రావాల్సిందిగా బంధువులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావడంతో ఆయా దేశాల నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌ శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు 16982 మందికిపైగా ప్రయాణికులు చేరుకున్నారు. వీరికి ఎయిర్‌పోర్ట్‌లోనే స్క్రీనింగ్‌ చేశారు. ఆ తర్వాత వీరిలో కొంత మంది జలుబు, జ్వరం, శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కరోనాగా అనుమానించి చికిత్స కోసం గాంధీ, ఫీవర్, ఛాతి, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోని నోడల్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఇలా ఇప్పటి వరకు గాంధీ వైరాలజీల్యాబ్‌లో 350 మందికి కరోనా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్‌ రిపోర్టు రావడంతో ప్రభుత్వంతో పాటు వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వీరికి వైద్యులు కీలక సూచనలు చేశారు. బాధితులు 20 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రావొద్దని సూచించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానిత బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులంతా ఎన్‌–90 మాస్కులు ధరించాల్సిందిగా సూచించారు.

మరోసారి బయటపడిన డొల్లతనం
సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌కు చెందిన (బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి)యువకుడు ఫిబ్రవరి 17న దుబాయ్‌ వెళ్లాడు. ఆయన అక్కడ హాంకాంగ్‌కు చెందిన వారితో కలిసి నాలుగు రోజుల పాటు పని చేసి ఇటీవల ఇండియాకు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ నిర్వహించినప్పటికీ..వైరస్‌ను గుర్తించకపోవడాన్ని పరిశీలిస్తే ఎయిర్‌పోర్టుల్లో నిర్వహిస్తున్న స్క్రీనింగ్‌ డొల్లతనం మరోసారి బయటపడింది. బాధితుడు తొలుత బెంగళూర్‌కు వెళ్లి, అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అదే బస్సులో ఆయనతో కలిసి మరో 27 మంది ప్రయాణించారు. ఇటీవల జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు గాంధీ ఆస్పత్రికి చేరుకోగా, వైద్యులు వెంటనే ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా, గాంధీ వైరాలజీ ల్యాబ్‌లోని ప్రాథమిక పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు మరింత అప్రమత్తమై రెండో శాంపిల్‌ను పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా అక్కడ కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో బెంగళూర్‌ నుంచి హైదరాబాద్‌కు బాధితునితో పాటు బస్సులో ప్రయాణించిన మరో 27 మందిని ట్రేస్‌ చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది.  

గాంధీకి 8 మంది
కాగా కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలిన యువకుడి కుటుంబ సభ్యులు ఎనిమిది మందిని కూడా గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు. సోమవారం వీరిని అనుమానిత రోగులుగా భావించి పరీక్షిస్తున్నారు.  

వైద్యులకు సెలవులు రద్దు
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ సహా ఫీవర్, ఛాతి ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లో వంద పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశాం. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనంలోని ఏడవ అంతస్తులో 20 పడకలతో రెండు ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. వీఐపీల కోసం ఏడు పేయింగ్‌ రూమ్స్‌లు ఏర్పాటు చేశాం. అత్యవసర విభాగంలో ఎక్యూట్‌ మెడికల్‌ కోవిడ్‌ ఐసీయులో పది పడకలను సిద్ధం చేశాం. ఓపీ, ఇన్‌పేషేంట్‌ విభాగాల్లో కోవిడ్‌ అనుమానితుల కోసం ప్రత్యేక లిఫ్ట్‌లు, ప్రధాన భవనంలో హెల్ప్‌డెస్క్‌ను కేటాయించాం. కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో సోమవారం సాయంత్రం గాంధీ వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాం. వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేశాం. మరికొంత మంది వైద్య సిబ్బందిని ఇతర ఆస్పత్రుల నుంచి డెప్యుటేషన్‌పై గాంధీకి కేటాయించాం. పర్సనల్‌ ఎక్విప్‌మెంట్‌ ప్రొటెక్షన్‌(పీఈపీ)ను అందుబాటులో ఉంచుతున్నాం.       
– డాక్టర్‌ రమేష్‌రెడ్డి, డీఎంఈ

ఆస్పత్రిలో చేరిన సునితా కృష్ణన్‌

దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ప్రముఖ సంఘ సేవకురాలు, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత సునితా కృష్ణన్‌ కూడా గాంధీలో చేరారు. ఇటీవల ఆమె బ్యాంకాక్‌ వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి ఆమె జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం సోమవారం గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమె నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. రిపోర్టు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే అబుదాబి నుంచి ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న కరీంనగర్‌కు చెందిన గర్భిణి (25)కి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా రిపోర్టు అయింది. ప్రస్తుతం ఆమె నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. (చదవండి: ఎంటర్‌ ద ‘వైరస్‌’)

వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం
స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనా వైరస్‌ పది రెట్లుప్రమాదకరం. వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్‌ గాల్లోకి ప్రవేశిస్తుంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటిలక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యం. సాధ్యమైనంత వరకు జన సమూహాల్లోకి వెళ్లొద్దు. తుమ్మినా, దగ్గినా ముక్కుకు అడ్డంగా ఎన్‌–90 మాస్కులు, చేతి రుమాళ్లుపెట్టుకోవాలి.
– డాక్టర్‌ శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top