పార్కింగ్‌ కోసం ప్రత్యేక పాలసీ: కేటీఆర్‌

పార్కింగ్‌ కోసం ప్రత్యేక పాలసీ: కేటీఆర్‌ - Sakshi


హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంతోపాటు, ఇతర పట్టణాల్లో పార్కింగ్ కోసం ప్రత్యేకమైన పాలసీ తీసుకురానున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖాధికారులతో  ఈ మేరకు సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రజలకు ప్రధానంగా పార్కింగ్, రోడ్ల నిర్వహణ లోపాల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.



ఇప్పటికే పలు దఫాలుగా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్లు, మున్సిపల్ శాఖా అధికారులతో పార్కింగ్ పాలసీ రూపకల్పనపైన సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ మేరకు రూపొందించిన పార్కింగ్ పాలసీ డ్రాప్ట్ పైనా అధికారులతో చర్చించారు. రోడ్లపైన వాహనాలు తిరిగేందుకు నిర్ధారించిన మార్గాన్ని కాపాడడం, రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీ ఉంటుందన్నారు. నగరంలోని ప్రణాళిక బద్దమైన అభివృద్ది దిశగా తీసుకుకెళ్లేందుకు ఈ పార్కింగ్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.  నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఎర్పాట్లతో పాటు ఖాళీ ప్రదేశాల్లోను పార్కింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం  చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు.



ఈ మేరకు ఖాళీ ప్రదేశాల యాజమాన్యాలను చైతన్యవంతం చేసేలా అధికారులు ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ మేరకు పార్కింగ్ కోసం ముందుకు వచ్చే వారికి పలు ప్రొత్సాకాలను ఇస్తామన్నారు. నూతనంగా భవనాలు నిర్మాణం చేసేవారు పార్కింగ్ కోసం నిర్దారిత పార్కింగ్ కన్నా అధికంగా పార్కింగ్ కల్పిస్తే వారికి భవన నిర్మాణ అనుమతుల్లో కొన్ని సడలింపులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.  గతంలో పార్కింగ్ కోసం ఉద్దేశించిన ప్రదేశంలో నిర్మాణాలు చేసిన కాంప్లెక్స్ ల్లో కూల్చివేతలు వేంటనే చేపట్టాలని ఛీప్ టౌన్ ప్లానింగ్ అఫీసర్ కు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top