రోడ్‌ సేఫ్టీ కమిషనరేట్‌ ఏర్పాటు 

Special Operations Division of all Highways Departments - Sakshi

అన్ని రహదారుల శాఖల్లో  ప్రత్యేక ఆపరేషనల్‌ విభాగం  

తుది రూపుదిద్దుకుంటున్న రోడ్డు భద్రత ముసాయిదా బిల్లు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో వందల మంది మృత్యువాత పడుతున్నారు. వేల మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. రహదారుల దుస్థితితో పాటు భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం కారణంగానే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రహదారుల స్థితిగతుల మెరుగుదలతోపాటు రహదారుల భద్రతా ప్రమాణాల అమలుపై నిరంతర పర్యవేక్షణ కోసం త్వరలో రోడ్‌ సేఫ్టీ కమిషనరేట్‌ ఏర్పాటు కానుంది. రహదారుల భద్రత బిల్లును సైతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. తుది రూపుదిద్దుకుంటున్న ఈ బిల్లును భవిష్యత్‌లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే రహదారుల భద్రతకు రాష్ట్రంలో మరింత ప్రాధాన్యత పెరగనుంది. అన్ని శాఖల పరిధిలోని రహదారుల స్థితిగతులు, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు రోడ్డు సేఫ్టీ కమిషనరేట్‌ పేరుతో కొత్త ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రహదారుల భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆపరేషనల్‌ వింగ్స్‌ను స్థాపించనున్నారు. అదేవిధంగా రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన నిధుల్లో కొంత శాతాన్ని రహదారుల భద్రత కోసం ఆయా శాఖలు కేటాయించనున్నాయి. రహదారుల భద్రతకు సంబంధించి హైకోర్టు గతంలో జారీ చేసిన ఓ తీర్పు అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఇటీవల రాష్ట్ర రవాణా, పురపాలక, పంచాయతీరాజ్, పోలీసు శాఖలు, జాతీయ రహదారుల విభాగం అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో రహదారు ల నిధుల నుంచి కొంత శాతాన్ని భద్రతా ప్ర మాణాల అమలుకు కేటాయించాలని
తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, క్షతగాత్రులు, మరణాల సంఖ్య తగ్గింపు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.  

24 గంటల్లో మరమ్మతులు..  
హైదరాబాద్‌ నగర పరిధిలో రహదారుల మరమ్మతుల కోసం 79 తక్షణ మరమ్మతుల బృం దాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. రహ దారులు దెబ్బతిన్న చోట్లలో తక్షణ మరమ్మతులు చేసేందుకు ఏడాది పొడవున ఈ బృందా లు పనిచేయనున్నాయి. గుంతలను బీటీ మిశ్రమంతో పూడ్చేందుకు బీటీ మిక్సింగ్‌ ప్లాంట్‌ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసుకుంది. నగరంలో దెబ్బతిన్న రోడ్లను కేవలం 24 గంటల్లోగా మరమ్మతు చేసేందుకు బృందాల సంఖ్య ను ఇంకా పెంచుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సీఎస్‌ ఎస్‌కే జోషి ఆదేశించారు. రా ష్ట్రంలో రహదారుల భద్రతా ప్రమాణాల అమలుపై సంబంధిత శాఖలతో ఇకపై ఆయన క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top