కడచూపూ కరువాయే.. | special aircrapt with sinidhi deadbody move | Sakshi
Sakshi News home page

కడచూపూ కరువాయే..

Jul 22 2014 4:04 AM | Updated on Sep 2 2017 10:39 AM

శ్రీనిధి శవపేటిక వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు, ఇన్‌సెట్‌లో శ్రీనిధి

శ్రీనిధి శవపేటిక వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు, ఇన్‌సెట్‌లో శ్రీనిధి

కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి రాజిరెడ్డి-అనంతలక్ష్మి దంపతుల రెండో కూతురు

అశ్రునయనాలతో శ్రీనిధి అంత్యక్రియలు
కన్నీటిసంద్రమైన రేకుర్తి

కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి రాజిరెడ్డి-అనంతలక్ష్మి దంపతుల రెండో కూతురు శ్రీనిధి(19) హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. విజ్ఞానయాత్రలో భాగంగా కళాశాల విద్యార్థులతో కలిసి గతనెల 3న శ్రీనిధి వెళ్లింది. 8న హిమాచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో శ్రీనిధి కూడా ఉందనే సమాచారంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు.

ఆమె అచూకీ కోసం తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. బియాస్ నది ఒడ్డున కూతురు అచూకీ కోసం పదిరోజులపాటు పడిగాపులు పడ్డప్పటికీ ఫలితం లేకపోవడంతో గతనెల 20న రేకుర్తికి తిరిగి వచ్చాడు.శ్రీనిధి జ్ఞాపకాలతో కాలం గడుపుతున్న కుటుంసభ్యులకు ఆదివా రం బియాస్ నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో శ్రీనిధి మృతదేహం లభించినట్టు సమాచారం అందింది. దీంతో వారిలో దు:ఖం మిన్నంటింది.
 
ప్రత్యేక విమానంలో మృతదేహం తరలింపు
శ్రీనిధి మృతదేహానికి ఆదివారం మండి జిల్లాలో పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీస్ అధికారులు ప్రత్యేక విమానంలో సోమవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపించారు. శ్రీనిధి మృతదేహం కోసం హైదరాబాద్‌కు ఆమె మేనమామ లింగారెడ్డి, డెప్యూటీ తహశీల్దార్ లింబాద్రి, ఆర్‌ఐ ఖాజా వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన శ్రీనిధి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని సాయంత్రం 4.45 గంటలకు రేకుర్తికి చేరుకున్నారు.
 
కన్నీటి సంద్రమైన రేకుర్తి
శ్రీనిధి మృతదేహమున్న శవపేటికను అంబులెన్స్ నుంచి కిందకు దించడంతోనే తల్లిదండ్రులు అనంతలక్ష్మి, రాజిరెడ్డి, సోదరి శ్రీతేజ, కుటుంబసభ్యులు బోరున విలపించారు. శ్రీనిధి శవపేటికపైపడి రోదించడం చూసిన గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. శ్రీనిధి శవపేటికను తిరిగి అంబులెన్స్‌లో చేర్చి శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శవపేటికలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయడంతో దుర్వాసన వెలువడింది. చివరిసారిగా శ్రీనిధి ముఖం చూడాలనే తల్లిదండ్రుల కోర్కే మేరకు మృతదేహానికి చుట్టిన కవర్లను బంధువులు విప్పేందుకు ప్రయత్నించగా, దుర్వాసన రావడంతో వెనుకడుగేశారు.

శ్రీనిధిని చివరిసారి చూస్తానంటూ తల్లి అనంతలక్ష్మి, అక్క శ్రీతేజ రోదించిన తీరు పలువురి హృదయాలను కలచివేసింది. చివరకు హిందూ సాంప్రదాయరీతిలో అంతిమసంస్కారాలు నిర్వహించిన అనంతరం కుమార్తె చితికి తండ్రి రాజిరెడ్డి నిప్పంటించారు. శ్రీనిధి మృతదేహానికి జిల్లా జడ్జి నాగమారుతిశర్మ, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్, సర్పంచ్ నందెల్లి పద్మప్రకాశ్, ఎంపీటీసీ సభ్యులు శేఖర్, నాగరాణి, బాలయ్యతో పాటు స్థానిక నాయకులు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement