ఇక హాస్టళ్లలోనూ భౌతిక ‘దూరం’

Social Distancing In Telangana Junior College Hostels - Sakshi

రెట్టింపు స్థలం ఉండేలా నిబంధనల్లో మార్పులు

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో విద్యార్థికి 50 ఎస్‌ఎఫ్‌టీ

ఇప్పుడు 100 ఎస్‌ఎఫ్‌టీ ఉండేలా అధికారుల కసరత్తు 

దీనిపై కమిటీ ఏర్పాటు చేసిన ఇంటర్‌ బోర్డు

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఇంటర్మీడియెట్‌ బోర్డు కసరత్తు ప్రారంభించింది. వీటికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేసేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీ హాస్టళ్ల అనుమతులకు సంబం ధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి హాస్టల్‌లో కనీసంగా 50 ఎస్‌ఎఫ్‌టీ స్థలం కేటాయించాలన్న నిబంధన ఉండగా దానిని రెట్టింపు చేయాలని బోర్డు భావిస్తోంది. వీలైతే అంతకంటే ఎక్కువ స్థలం కేటాయించేలా చూడాలన్న ఆలోచన చేస్తోంది. త్వరలోనే ఆ నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతోంది. వాటి ప్రకారమే హాస్టళ్ల గుర్తింపు కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేలా ఇంటర్మీడియెట్‌ బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.

లక్షన్నర మందికిపైగా.. 
రాష్ట్రంలో 2,500కు పైగా జూనియర్‌ కాలేజీలుంటే అందులో ప్రభుత్వ, ఎయిడెడ్, సంక్షేమ శాఖల గురుకుల జూనియర్‌ కాలేజీలు పోగా ప్రైవేటు కాలేజీలు 1,556 ఉన్నాయి. అందులో నివాస వసతితో కూడిన(హాస్టళ్లతో) జూనియర్‌ కాలేజీలు 570 వరకు ఉన్నట్లు బోర్డు అధికారులు అంచనా. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే 9.5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ, గురుకుల కాలేజీల్లో దాదాపు 3.5 లక్షల మంది చదువుతుండగా, 6 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లోనే చదువుకుంటున్నారు. అందులో లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాస్టళ్లలోనే ఉంటున్నారు.

ప్రస్తుతం ఆయా కాలేజీ హాస్టళ్లలో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదు. నలుగురు ఉండాల్సిన గదుల్లో 8 నుంచి 10 మందిని ఉంచుతున్నారు. సదుపాయాలు పెద్దగా కల్పించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఐదారు అంతస్తులుండే హాస్టళ్లలో లిఫ్ట్‌ సదుపాయం కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా రావడంతో అధికారులు ఆలోచనల్లో పడ్డారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించడం కూడా ప్రధానమే కావడంతో 2020–21 విద్యా సంవత్సరంలో హాస్టళ్లలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. మరో వేయి వరకు పాఠశాలల హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లోనూ ఇవే నిబంధనలను అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది. చదవండి: తగ్గిన కంటైన్మెంట్‌ జోన్లు

2018లోనే నిబంధనలు రూపొందించినా...
హాస్టళ్లలో ఉండాల్సిన ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై 2018 మార్చిలోనే ఇంటర్మీడియెట్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే హాస్టళ్ల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఫీజును నిర్ణయించింది. ముందుగా ఫీజు ఎక్కువగా ఉందని యాజమాన్యాలు పేర్కొనడంతో మూడుసార్లు ఫీజు తగ్గించింది.

అయినా యాజమన్యాలు ముందుకు రాకపోగా, కోర్టును ఆశ్రయించాయి. దీంతో బోర్డు ఆ నిబంధనల అమలును పక్కన పెట్టింది. ప్రస్తుతం ఒక్కో హాస్టళ్లలో 300 నుంచి 500 వరకు విద్యార్థులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేయడం ద్వారా భౌతిక దూరం పాటించేలా చేయవచ్చన్న ఆలోచనకు వచ్చింది. దీంతోపాటు ప్రతి చోట భౌతిక దూరాన్ని పెంచేలా నిబంధనల్లో మార్పులు చేసేందుకు అధికారుల కమిటీ చర్యలు చేపట్టింది. 

మార్పులు చేయనున్న కొన్ని నిబంధనలు (ప్రస్తుతం ఉన్నవి)...
►25 మంది విద్యార్థులు ఉండే ఒక్కో డార్మెటరీ 1,000 ఎస్‌ఎఫ్‌టీ ఉండాలి. రూమ్‌ అయితే ఒక్కో విద్యార్థికి 50 ఎస్‌ఎఫ్‌టీ ఉండాలి.
► 25 మంది విద్యార్థులకు స్టడీ రూమ్‌ 300 ఎస్‌ఎఫ్‌టీ ఉండాలి.
►ఫస్ట్‌ ఎయిడ్‌/సిక్‌ రూమ్‌ ఒక్కో విద్యార్థికి 75 ఎస్‌ఎఫ్‌టీ ఉండాలి. డార్మెటరీ లాంటిదైతే 10 మందికి 750 ఎస్‌ఎఫ్‌టీ ఉండాలి.
►కిచెన్‌ 250 ఎస్‌ఎఫ్‌టీ, డైనింగ్‌ హాల్‌ కనీసంగా 500 ఎస్‌ఎఫ్‌టీ, రిక్రియేషన్‌ రూమ్‌ 300 ఎస్‌ఎఫ్‌టీ, లైబ్రరీ 500 ఎస్‌ఎఫ్‌టీ, ఆఫీస్‌ ఏరియా 500 ఎస్‌ఎఫ్‌టీ, కౌన్సెలింగ్‌/గైడెన్స్‌ రూమ్‌ 120 ఎస్‌ఎఫ్‌టీ ఉండాలి. 

కొన్నాళ్లు భౌతికదూరం పాటించేలా..
రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల్లోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం తప్పనిసరి కావడంతో ఏం చేయాలన్న ఆలోచనల్లో అధికారులు పడ్డారు. ఇప్పటికిప్పుడు అదనపు తరగతి గదులను నిర్మించడం సాధ్యం కాని పరిస్థితి. అయితే వీలైనంత వరకు విద్యార్థుల మధ్య దూరం పాటించేలా చేయాలని భావిస్తోంది. విద్యార్థులను విభజించి షిఫ్ట్‌ పద్ధతిలో తరగతులను కొనసాగించే ఆలోచన చేస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా చర్చించాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పరిధిలోని హాస్టళ్లలోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top