తగ్గిన కంటైన్మెంట్‌ జోన్లు | Sakshi
Sakshi News home page

తగ్గిన కంటైన్మెంట్‌ జోన్లు

Published Tue, Apr 28 2020 2:28 AM

Medical And Health Ministry Has Reduced Containment Zones In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్యను వైద్య, ఆరోగ్యశాఖ తగ్గించింది. సమగ్ర ఇంటింటి సర్వే ముగియడం, లక్షణాలున్న వారిని గుర్తించడం వంటివి పూర్తికావడంతో కంటైన్మెంట్‌ ప్రాంతాలను కుదించారు. మొదట్లో దాదాపు 243 వరకు కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్య దాదాపు సగం మేరకు తగ్గించారు. వివిధ జిల్లాల్లో 62, హైదరాబాద్‌లో 70 వరకు ప్రస్తుతం కంటైన్మెంట్‌ జోన్లు నడుస్తున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కంటైన్మెంట్‌ జోన్లలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇందులో పాల్గొని లక్షలాది మందిని సర్వే చేశారు. ఎవరికైనా జ్వరం, కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని గుర్తించారు. కొన్నిచోట్ల ఆ సర్వేపై వ్యతిరేకత వచ్చినా చాలావరకు సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు. 

దిగ్బంధమే లక్ష్యం...
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. దీంతోపాటు రాత్రి వేళల్లో కర్ఫ్యూను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఏదైనా అత్యవసరమైతేనే బయటకు రావడానికి అనుమతి ఉంది. నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవడానికి అవకాశముంది. అయితే కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం పూర్తి నిర్బంధంలోనే ప్రజలు ఉంటారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన చోట దాని తీవ్రతను బట్టి రెండుమూడు కిలోమీటర్ల వరకు కంటైన్మెంట్లు ఏర్పాటు చేశారు.

తీవ్రత తక్కువ ఉన్నచోట 100 ఇళ్లున్నా కంటైన్మెంట్లను ఏర్పాటు చేశారు. ఈ జోన్లలోని ప్రజలు బయటకు రావడానికి వీలులేదు. బయటివారు ఇక్కడకు వెళ్లడానికి అవకాశంలేదు. మొత్తం 3,500 వైద్య బృందాలు ఈ జోన్లలో ప్రజల ఆరోగ్య స్థితిగతులను అంచనా వేశాయి. పోలీసులు గట్టి నిఘా పెట్టారు. కొన్నిచోట్ల డ్రోన్లతోనూ నిఘా నిర్వహించారు. అంతేకాదు ఆయా కంటైన్మెంట్‌ ఏరియాల్లోని హోంక్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలను ప్రత్యేక యాప్‌ ద్వారా పరిశీలించారు. 

కేసులు తగ్గుముఖం పట్టడంతో...
రాష్ట్రంలో గత 5 రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈ నెల 22న 15 కేసులు నమోదుకాగా, 23న 27, 24న 13, 25న 7, 26న 11 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఈ నెల 21న 56 కేసులు నమోదయ్యాయి. 19న 49 కేసులు రికార్డయ్యాయి. ఈ నెల 3న ఏకంగా 75 కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదు రోజులు కేసులు తగ్గుతుండటంతో ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్యను కుదిస్తూ పోతోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. పైగా జిల్లాల్లోనూ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 26న నమోదైన 11 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నుంచే నమోదయ్యాయి. చదవండి: ఇది శుభసూచకం 

గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే అధికంగా 540 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే రెండో కాంటాక్టులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొద్దన్న సర్కారు నిర్ణయంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య తగ్గింది. విదేశీ కాంటాక్టులు, మర్కజ్‌ కాంటాక్టులు అన్నీ పూర్తయ్యాయి. వారి రెండో కాంటాక్టులకు ఇప్పుడు పరీక్షలను నిలిపివేశారు. కేవలం లక్షణాలుంటేనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే వారు, ఇతరత్రా కరోనా అనుమానిత లక్షణాలున్న వారికే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందువల్ల కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఎటువంటి లక్షణాలు లేని విదేశీ, మర్కజ్‌ రెండో కాంటాక్టులకు నిర్ధారణ పరీక్షలు చేయడం వృథా ప్రయాసని వారు పేర్కొంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement