ఎన్నికల కేసు రుజువైతే కఠిన శిక్షలు : రజత్‌కుమార్‌

Serious Punishments for Election related crime says Rajath kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌ తెలిపారు. అభ్యర్థులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, తెలియకపోతే పుస్తకాలు చదవాలని సూచించారు.17 నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల తనిఖీ ఉంటుందన్నారు. అభ్యర్థులు రూ.10 వేలు మాత్రమే నగదు కలిగి ఉండొచ్చని, 10 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే చెక్కుల రూపంలో చెల్లింపు చేయాలన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం ఉన్నంతగా తెలంగాణలో లేదని రజత్‌కుమార్‌ చెప్పారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న నేతలపై మావోయిస్టులు నిఘా పెట్టినట్టు తెలుస్తుందని, అభ్యర్థులకు స్థానిక పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. పక్క రాష్టాల ఎన్నికల అధికారులు కూడా వచ్చి ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నారని, తాను కూడా ఆ సమావేశానికి హాజరు అవుతానని చెప్పారు. ఇప్పటి వరకు 2614 సివిజిల్ ఫిర్యాదులు అందగా,1950 హెల్త్ లైన్ కు 78272 కాల్స్ వచ్చాయన్నారు. కుల, మత సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేయడం నేరం అన్నారు. సరైన సమాధానం రాకపోతే ఈసీఐకి పంపిస్తామన్నారు. ఎన్నికల కేసు రుజువు అయితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. కుల, మత సమావేశాలకు సంబంధించిన పూర్తి నిబంధనలు అన్ని పార్టీలకు పంపిస్తామన్నారు.

సంగారెడ్డి కలెక్టర్ కేసుకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఆ విషయం తన దృష్టికి రాలేదని రజత్‌కుమార్‌ అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు నోటీసులు ఇచ్చామని, కొందరి నుంచి సమాధానాలు వచ్చాయన్నారు. మిగిలినవారి నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. స్మిత సబర్వాల్ పై మాజీ ఎంపీ మధుయాష్కీ ఫిర్యాదు చేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఒక వేళ వస్తే వివరణ అడుగుతామని తెలిపారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్‌కు భాష సక్రమంగా లేదని నోటీసులు ఇచ్చామన్నారు. కుల, మత సమావేశాలు నిర్వహిస్తే 153ఏ, 505 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అభ్యంతరకరమైన భాష వాడినా కూడా కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పార్టీ కాబట్టి టీడీపీకి సైకిల్ గుర్తు ఇస్తామని, సమాజ్ వాదీ పార్టీకి మరో గుర్తు కేటాయిస్తామన్నారు. 

ఆన్‌లైన్‌లో ఓటర్లకు బహుమతులు పంపిణీ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారంకు సంబంధించి ఖర్చును లెక్కింపు చేయడానికి థర్డ్ పార్టీతో ఒప్పందం చేసుకున్నామని రజత్‌కుమార్‌ అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. రెండు, మూడు ఓట్లు కలిగిన వారు ఒక్క ఓటే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. 53 మంది వ్యయ పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారని, ఒక్కో నియోజకవర్గానికి అసిస్టెంట్ అబ్జర్వర్ ఉంటారన్నారు. ఒక వీడియో గ్రాఫర్‌తో పాటూ మరొకరు ఉంటారని చెప్పారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో ఒక్కో అకౌంటింగ్ టీమ్ ఉంటుందన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో 47 మందిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అనర్హులుగా  ప్రకటించిందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top