మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో రాజకీయ సమీకరణాల కోసం వివిధ పార్టీల నాయకులు సమాయత్తం అవుతున్నారు.
శంకర్‌పల్లి,న్యూస్‌లైన్: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో రాజకీయ సమీకరణాల కోసం వివిధ పార్టీల నాయకులు సమాయత్తం అవుతున్నారు. శంకర్‌పల్లి మండల పరిధిలోని పొద్దుటూర్ ప్రగతి రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈమేరకు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, ఎమ్యెల్సీ యాదవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి కాలె యాదయ్య ఇతర ముఖ్యనేతలు హాజరయినట్లు తెలిసింది.
సోమవారం వెలువడనున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు , మంగళవారం వెలువడనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, ఆ తరువాత అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఎంపీపీ స్థానాలతోపాటు, జెడ్పీటీసీ చైర్మన్‌గిరి కైవసం చేసుకోవాలనే దానిపై ప్రత్యేకంగా చర్చించారని తెలుస్తోంది. అయితే సమావేశానికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు నాయకులు నిరాకరించారు.