శిలలపై శిల్పాలు చెక్కాడు

Sculpture Artist Umesh Chandra From Khammam - Sakshi

బొమ్మలను ఎవరైనా పేపర్, చార్ట్, వైట్‌ క్లాత్‌లపై వేస్తారు. కానీ, రాళ్లపై చిత్రాలు గీసే వారు అరుదుగా కనిపిస్తారు. పాఠశాలకు వెళ్తూ వెళ్తూ రోడ్డు పక్కన రాళ్లపై బొమ్మలు చెక్కుతున్నవారిని చూసి, అలా తాను చెక్కాలనుకుని, అదే కళను నేర్చుకుని, ఇప్పుడు దానిని జీవనోపాధిగా మల్చుకుని రాణిస్తున్నాడు ఆ యువకుడు. అలా శిలలపై చిత్రాలు చెక్కే అతని కళకు దాసోహమంటున్నారు ప్రజలు. అతడి కళాఖండాలు విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అంతేకాకుండా పాఠశాలలకు ఉచితంగా సరస్వతిదేవి చిత్రాలను అందిస్తూ తనలోని దాతృత్వాన్నీ చాటుతున్నాడు ఖమ్మం వాసి ఉమేశ్‌చంద్ర. 

సాక్షి, ఖమ్మం: శిలలపై అతడి చేతులు అలవోకగా చిత్రాలు గీస్తాయి. అతి తక్కువ సమయంలోనే శిలపై అందమైన రూపం సంతరించుకుంటుంది. చదువుకునే సమయంలోనే ఈ కళపై ఏర్పడిన మక్కువ అతడికి జీవనోపాధిని కూడా కల్పిస్తోంది. ఇప్పుడు జిల్లాలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనే ఏడు జిల్లాలకు శిలాఫలకాలపై చిత్రాలను గీయడం, ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలకు శిలాఫలకాలను పంపించడం వంటివి చేస్తున్నాడు. ఇంతగా తనకు నేర్పిన కళకు గుర్తుగా సరస్వతిదేవి బొమ్మలను చెక్కి పాఠశాలలకు వితరణగా అందిస్తున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఉమేశ్‌చంద్ర జన్మించారు. ఉపాధి కోసం అతడి తల్లిదండ్రులు 20 ఏళ్ల కిందట ఖమ్మానికి వచ్చారు. దీంతో ఖమ్మంలోనే ఉమేశ్‌చంద్ర విద్యాభ్యాసం సాగింది. చదువుకుంటున్న సమయంలో.. పాఠశాల కు వెళ్లే దారిలో ఉపేంద్రాచారి, కిరీటి అనే కళా కారులు ఇలా శిలాఫలకాలపై చిత్రాలను గీస్తుండటాన్ని ఉమేశ్‌చంద్ర గమనించాడు.

వారు చిత్రాలను గీస్తున్న తీరు చూసి ఇతడి మనసంతా పులకరించిపోయింది. తాను కూడా అలా గీయాలని తపన పడ్డాడు. సొంతంగా చిత్రాలను గీయడం మొదలు పెట్టాడు. 2003లో పెయింటింగ్‌ వేయడం ప్రారంభించాడు. ఉపేంద్రాచారి, కిరీటీలకు ఏకలవ్య శిష్యుడిగా మారి.. పెయింటింగ్‌తోపాటు రాతిపై శిల్పాలు గీస్తూ తన కళను మెరుగు పరుచుకున్నాడు. మొట్టమొదటిగా రాతిబండపై అంబేడ్కర్‌ చిత్రాన్ని అద్భుతంగా గీయడంతో అతడి కళకు గుర్తింపు లభించింది. అనంతరం మరింతగా శ్రమించి శిలలపై చెక్కడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అలవోకగా.. చిత్రాలను రాతిబండపై గీస్తూ రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. విదేశాలకు కూడా తన కళాఖండాలను ఎగుమతి చేస్తూ బిజీగా ఉన్నాడు.

కళాఖండమంటే ఉమేశ్‌చంద్ర..
రాష్ట్రవ్యాప్తంగా ఉమేశ్‌చంద్ర కళాఖండాలు గుర్తింపు పొందాయి. విదేశీయులు కూడా తమ మిత్రుల ద్వారా ఉమేశ్‌చంద్ర నుంచి తమకు కావాల్సిన కళాఖండాలను గీయించుకుని వెళ్తుంటారు. ఖమ్మం నగరంలో ఉన్న పలు షాపుల వారు కూడా ఉమేశ్‌చంద్రకు ఆర్డర్లు ఇచ్చి శిలాఫలకాలపై చిత్రాలను గీయించుకుంటుంటారు. జాతీయ నేతల చిత్రపటాల నుంచి అపురూప చిత్రాలను, ప్రకృతి దృశ్యాలను, ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు శిలాఫలకాలను అందజేస్తుంటారు. అంబేడ్కర్, అబ్దుల్‌ కలాం, రాజకీయ నాయకులు, సినీనటులు, గిరిజన నేపథ్యం కలిగిన కళాఖండాలను, సామాజిక స్పృహను కలిగించే చిత్రాలను గీస్తుంటాడు. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆయన కళాఖండాలు అందజేస్తుంటాడు. 

అమ్మ పేరుతో కళాసేవా సమితి

అమ్మ పద్మావతి పేరుతో కళాసేవా సమితి ట్రస్టును ప్రారంభించి ఏడాదిన్నరగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా శిలాఫలకాలపై సరస్వతి దేవి చిత్రాలను గీసి అందిస్తున్నాను. చిన్ననాటి నుంచే నాకు పెయింటింగ్‌పై ఉన్న ఆసక్తితో ఈ రంగాన్ని ఎంచుకుని జీవనాన్ని సాగిస్తున్నాను. ఏటా ఖమ్మంలో జరిగే ఎగ్జిబిషన్లలో నా శిల్పకళలను ప్రదర్శనకు పెడతాను. ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఇటలీ దేశస్తులు కూడా వారికి కావాల్సిన కళారూపాలను ఫోన్‌ ద్వారా తెలిపి గీయించి తీసుకెళ్తుంటారు.
–ఉమేశ్‌చంద్ర, కళాకారుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top