చదవాలంటే.. నడవాల్సిందే!

School Students Problems In Jadcherla - Sakshi

రూ.కోట్లతో బీటీ రోడ్ల ఏర్పాటు 

అయినా ఆర్టీసీ బస్సు సర్వీస్‌లకు నోచుకోని పల్లెలు 

నిత్యం విద్యార్థులు, ప్రజల ఇక్కట్లు 

రాజాపూర్‌ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు రూ.కోట్లు వెచ్చించి బీటీ రోడ్లు, అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా.. మరోవైపు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా కూడా ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు గ్రామాలకు కొనసాగకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఇటీవల బీటీ రోడ్లు వేయించారు. అయినా కూడా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదవులు నిమిత్తం ఎండనకా.. వాననకా రోజూ కిలోమీటర్ల పొడవునా కాలినడకన నడవాల్సి వస్తుంది.   

ఉన్నత చదువులకు నడవాల్సిందే..  
 ఒకప్పుడు గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే ఆరోపణతో ఆర్టీసీ అధికారులు గ్రామాలకు బస్సులను నడిపేవారు కాదు. కానీ, ప్రస్తుతం అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు ఉన్నా నేటికీ ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు మాత్రం కొనసాగడంలేదు. దీంతో రవాణా సౌకర్యం లేక రైతులు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని తిర్మలాపూర్,కల్లేపల్లి, ఈద్గాన్‌పల్లి, రాయపల్లి, నందిగామ, చెన్నవెల్లి, కుచ్చర్‌కల్, దోండ్లపల్లి, కుత్నేపల్లి, చొక్కంపేట్‌ తదితర గ్రామాలకు చక్కటి బీటీ రోడ్లు ఉన్నా ఇక్కడ ప్రాథమిక విద్య మాత్రమే అందుబాటులో ఉంది. పై చదువుల కోసం రాజాపూర్, రంగారెడ్డిగూడ, తిర్మలాపూర్‌లలోని ఉన్నత పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ విద్య కోసం షాద్‌నగర్, జడ్చర్ల పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే, బస్సు సౌకర్యం లేకపోవడంతో నిత్యం గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు నాలుగైదు కిలోమీటర్లు విద్యార్థులు నడవాల్సి వస్తుంది. అటు నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో పాఠశాలలు, కళాశాలలకు చేరుకుంటున్నారు. 

బస్సులే లేవు.. ఇక పాసులెందుకు? 

ఇదిలాఉండగా, విద్యార్థులకు ఆర్టీసి సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్సు పాసులు ఇస్తుంది.కానీ, బస్సులు లేకపోతే బస్సు పాసులెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఆటోలలో తమ పిల్లలను పక్క గ్రామాలకు చదువుకునేందుకు తప్పని పరీస్థితుల్లో పంపిస్తున్నారు. అంతేకాకుండ ప్రయివేటు వాహనాలను ఆశ్రయించడంతో ఒక్కోసారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు సర్వీస్‌ నడిపించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.   

6 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది

ప్రతి రోజు పై చదువుల కోసం గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు ఉదయం, సాయంత్రం నడుచుకుంటూ వెళ్లి వస్తాం. రోజూ 6 కిలోమీటర్లు నడక తప్పదు. ఎండాకాలం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆర్టీసీ వారు విద్యార్థులకు బస్సుపాసులు ఇస్తున్నారు. బస్సులే లేనప్పుడు ఇక పాసులెందుకు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top