ఆయిల్‌ఫెడ్‌లో ‘వ్యాట్‌’ కుంభకోణం | Scam In the Telangana Oilfed | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ఫెడ్‌లో ‘వ్యాట్‌’ కుంభకోణం

Jun 26 2019 3:21 AM | Updated on Jun 26 2019 3:21 AM

Scam In the Telangana Oilfed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో ‘వ్యాట్‌’ కుంభకోణం ఆలస్యంగా వెలుగుచూసింది. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయిల్‌ఫెడ్‌ దాదాపు రూ.3.76 కోట్ల మేర నష్టపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అంత పెద్దస్థాయిలో నష్టం జరగడానికి బాధ్యులను గుర్తించినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు లోనవుతున్నారన్న చర్చ జరుగుతోంది. పైగా దానికి బాధ్యులైన కొందరు సీనియర్‌ ఉద్యోగులు పైస్థాయిలో అండదండలు చూసుకుని జరిగిన నష్టానికి బాధ్యత వహించడం లేదని తెలిసింది. వ్యవహారం బయటకు పొక్కకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఇది తెలియకుండా దాచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది నిర్లక్ష్యమా? లేక కోట్ల రూపాయల నష్టం చవిచూడడంలో ఎవరికైనా లబ్ధి జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయిల్‌ఫెడ్‌లో ఇతర ఉద్యోగులు కూడా దీనిపై ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.  

అసలేం జరిగిందంటే?  
2016 నుంచి 2017 జూన్‌ మధ్య కాలంలో జరిగిన వ్యవహారం ఇది. అప్పట్లో అప్పారావుపేట ఆయిల్‌ఫాం ప్లాంటును నెలకొల్పారు. అందుకోసం ఆయిల్‌ఫెడ్‌ పామాయిల్‌ ప్లాంటుకు, సివిల్‌ పనులకు, అన్ని రకాల పనుల కోసం రూ. 75.13 కోట్లు ఖర్చు చేసింది. పామాయిల్‌ ప్లాంటు, ఇతర యంత్రాలు నెలకొల్పే బాధ్యత ప్రీ యూనిక్‌ అనే సంస్థకు అప్పగించారు. అందులో ఆ ఒక్కదానికే రూ. 45.42 కోట్లు ఖర్చు చేసింది. ఇలా వివిధ కంపెనీలకు వివిధ రకాల పనులను అప్పగించింది. ఆయా కంపెనీలన్నీ కూడా మిషనరీని కొనుగోలు చేసి అప్పారావుపేటలో ఫ్యాక్టరీని, దానికి సంబంధించిన ఇతర పనులను పూర్తిచేశాయి. మెటీరియల్‌ విలువను ఆధారం చేసుకొని ఆ కంపెనీలు వ్యాట్‌ను ప్రభుత్వానికి చెల్లించాయి. ఆ మొత్తం వ్యాట్‌ విలువ రూ. 3.63 కోట్లు. మరోవైపు అశ్వారావుపేటలో అప్పటికే ఉనికిలో ఉన్న పామాయిల్‌ ఫ్యాక్టరీ ఆధునీకరణ పనుల కోసం ఆయిల్‌ఫెడ్‌ కొన్ని కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఆ కంపెనీలు రూ. 6 కోట్లకు పైగా విలువైన మెటీరియల్‌ను వాడారు. అందుకోసం దాదాపు రూ. 12.74 లక్షలకు పైగా వ్యాట్‌ సొమ్ము చెల్లించాయి. రెండూ కలిపి మొత్తంగా రూ. 3.76 కోట్ల వ్యాట్‌ను రెండు ఫ్యాక్టరీలకు కలిపి జరిగిన పనులకు ఆయా కంపెనీలు చెల్లించాయి.

ఆ తర్వాతే మొదలైన అసలు కథ...
ఆయా కంపెనీలు రూ. 3.76 కోట్లు వ్యాట్‌ చెల్లించాయి. కంపెనీ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ, మరో ఫ్యాక్టరీ ఆధునీకరణ అనంతరం అక్కడ పామాయిల్‌ ఉత్పత్తి జరుగుతోంది. అలా ఉత్పత్తి అయిన పామాయిల్‌ను ఆయిల్‌ఫెడ్‌ విక్రయిస్తుంది. అలా విక్రయించిన పామాయిల్‌కు కూడా వ్యాట్‌ను చెల్లిస్తుంది. ఇక్కడ జరిగిందేంటంటే ఒకవైపు ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన యంత్రాలకు ఆయా కంపెనీలు అప్పటికే వ్యాట్‌ చెల్లించాయి. మరోసారి ఆయిల్‌ఫెడ్‌ అవే ఫ్యాక్టరీల ద్వారా తాను ఉత్పత్తి చేసిన పామాయిల్‌ విక్రయాలపైనా వ్యాట్‌ను చెల్లించింది. కానీ ఇలా చేయాల్సిన అవసరంలేదని ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల మెటీరియల్‌కు వ్యాట్‌ చెల్లించినందున, వాటి ద్వారా ఉత్పత్తి అయి విక్రయించిన దానికి వ్యాట్‌ చెల్లించాల్సిన అవసరంలేదని అంటున్నారు. అంటే అక్కడ మినహాయింపు కోరాల్సిన అవసరం ఉంది. ఆయా కంపెనీలు చెల్లించిన రూ. 3.76 కోట్లను మినహాయింపు కోరే అవకాశం ఆయిల్‌ఫెడ్‌కు ఉంది. అంటే ఆయిల్‌ఫెడ్‌ తాను అమ్మే పామాయిల్‌కు చెల్లించే వ్యాట్‌ సొమ్ములోనుంచి రూ. 3.76 కోట్లు మినహాయించుకోవాలి. కానీ అలా కొద్ది సొమ్మును మాత్రమే మినహాయించినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు సంస్థ నష్టపోయిందని ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వ్యాఖ్యానించేందుకు అధికారులు ముందుకు రావడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement