
మల్బరీ తోటల్లో పామాయిల్ వేసుకోండి
పట్టు రైతులకు కాకినాడ కలెక్టర్ సూచన
ఆందోళన చెందుతున్న పట్టు రైతులు
పట్టు (సిల్క్) ఉత్పత్తిలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం రాష్ట్రంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి మల్బరీ సాగు, పట్టుగూళ్ల ఉత్పత్తిని చూసిన స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్ గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలును సిల్క్ హబ్‌గా, సిల్క్ సిటీగా మారుస్తానని హామీలిచ్చారు. తీరాచూస్తే ఆ హామీ నెరవేరకపోగా.. రాష్ట్రానికే వన్నే తెచ్చిన పట్టు పరిశ్రమ ఇప్పుడు మూతపడే పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. – పిఠాపురం
మంగళం పాడేసినట్టేనా!
ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ పట్టు రైతులు ఇటీవల గుంటూరులోని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్‌కు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్రవర్షిణికి సోమవారం వినతిపత్రం అందజేయగా.. ఆమె సూచన మేరకు కాకినాడలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను కలిశారు.
పంటలు పోయి నష్టాల పాలయ్యామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చారు. ఆ సందర్భంగా ‘ఇబ్బందులు పడుతూ పట్టు సాగు చేయడం ఎందుకు. అది మానేసి పామాయిల్ సాగు చేసుకోండి’ అని కలెక్టర్ సలహా ఇచ్చారని రైతులు చెబుతున్నారు. కలెక్టర్ మాటలనుబట్టి పట్టు పరిశ్రమకు ప్రభుత్వం ఇక మంగళం పాడేసినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటను దున్నేస్తున్న రైతులు
పట్టు పురుగులకు ఆహారం కోసం వినియోగించే మల్బరీ తోటల్ని సాగు చేసేందుకు కొత్త రైతులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే సందర్భంలో పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు కూడా గిట్టుబాటుకాక సాగును వదిలేస్తున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలం చేబ్రోలులోనే సుమారు 400 ఎకరాల్లో మల్బరీ సాగు చేయగా, ఇప్పటికే వందల ఎకరాల్లో పంటను దున్నేశారు. రాష్ట్రంలో పలమనేరు, హిందూపురంతో పాటు కాకినాడ జిల్లాలోని చేబ్రోలులో పట్టు పరిశ్రమ కేంద్రాలు ఉన్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో 5, పెద్దాపురం డివిజన్‌లో 12, కాకినాడ డివిజన్‌లో 2 మండలాల్లో 4,500 ఎకరాల్లో 1,150 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టు పరిశ్రమ సుమారు 50 ఏళ్లుగా ఓ వెలుగు వెలుగుతోంది. ఇలాంటిచోట కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో సరైన ధర రాక, పంట కొనేవారు లేక, పెట్టుబడి దక్కక, కనీసం కౌలుకు తీసుకునే వారు కూడా ఉత్సాహం చూపకపోవడంతో పట్టు రైతులు పంటకు విరామం ప్రకటిస్తున్నారు.
ఎకరం విస్తీర్ణంలో మల్బరీ సాగుకు రూ.లక్ష పెట్టుబడి అవుతోంది. పట్టు పురుగుల పెంపకానికి 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పున షెడ్ నిర్మాణానికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతోంది. దీని నిర్వహణకు రూ.50 వేల వరకూ ఖర్చవుతోంది. గతంలో ఇక్కడ పండించిన పట్టుగూళ్లకు కేజీకి రూ.550 వరకూ ధర వచ్చేది. ప్రస్తుతం రూ.250కి కూడా కొనేవారు లేకపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు.
మరోవైపు ప్రభుత్వం మల్బరీ రైతులకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రతి రైతుకు రూ.లక్షల్లో బకాయి పెట్టింది. పైగా షెడ్ల నిర్మాణానికి ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం ఇవ్వడం లేదు. దీనికి తోడు ఊజీ ఈగ దాడితో పాటు వివిధ రకాల తెగుళ్లతో పట్టు పురుగులు గూళ్లు కట్టలేదు. ఫలితంగా పట్టు సాగు తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో సగానికి పైగా రైతులు తమ మల్బరీ తోటలను దున్నేశారు.
కాకినాడ జిల్లాలో మల్బరీ సాగు వివరాలు
సాగు చేస్తున్న మండలాలు 19
గ్రామాలు 155
పట్టు రైతుల సంఖ్య 1,150
సాగు విస్తీర్ణం 4,500ఎకరాలు
రోజుకు పట్టుగూళ్ల దిగుబడి 5 టన్నులు
ఆదుకుంటారనుకుంటే ఆపేయమంటున్నారు
ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ మా ఊరొచ్చి మాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. సిల్క్ సిటీ కడతానన్నారు. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తే.. ‘నష్టాలు వచ్చేటప్పుడు ఆ పంట ఎందుకు? వేరే పంటలు సాగు చేసుకోవచ్చు కదా’ అని అంటున్నారు. ‘ముందు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పించండి. తరువాత పంట వేయాలో మానేయాలో నిర్ణయించుకుంటాం’ అని చెప్పాం. అధికారుల తీరు చూస్తుంటే పట్టు సాగు చేయనిచ్చేలా లేరు. – ఓరుగంటి ఏసుబాబు, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం
పామాయిల్ వేసుకోమంటున్నారు
పట్టు సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడిగితే ఈ పంట మానేసి పామాయిల్ వేసుకోవాలని చెప్పడం విస్మయం కలిగించింది. నష్టం వస్తోందని ఆపుకుంటూ పోతే ఇక్కడ ఇక ఏ పంటలూ ఉండవు. నష్టాలు రాకుండా ఏం చేయాలన్నది ఎవరూ ఆలోచించడం లేదు. మాకు రావాల్సిన ప్రోత్సాహకాల గురించి మాట్లాడటం లేదు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాం. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న వారు కనిపించడం లేదు. – ఓరుగంటి శ్రీను, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం