తాళాలేసి పని కానిస్తున్నారు...

Saw Mill Owners Rules Voilation In Kagajnagar - Sakshi

సాక్షి, కాగజ్‌నగర్ ‌: పట్టణంలోని కొంత మంది సా మిల్లు (కలప కటింగ్‌ కేంద్రం) యజమానులు అటవీ శాఖ నుంచి రెన్యూవల్‌ ప్రక్రియ పూర్తి కాకపోయినా దర్జాగా మిల్లులను నడిస్తున్నారు. ప్రతి సంవత్సరం సా మిల్లు నిర్వాహకులు అటవీ శాఖ నుంచి రెన్యూవల్‌ (అధికారిక  అనుమతి) పొందాలి. ఈ సంవత్సరం 2020 మార్చి 31న సా మిల్లుల కాలపరిమితి ముగిసింది. ఉన్నతాధికారులు రెన్యూవల్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి ఏప్రిల్‌ 30 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగిసి 13 రోజులు గడుస్తున్నప్పటికీ కొంత మంది సా మిల్లు నిర్వాహకులు రెన్యూవల్‌ ప్రక్రియను ఇప్పటి వరకూ పూర్తి చేయించలేదు. సరికదా నిబంధనలకు నీళ్లొదిలి దర్జాగా మిల్లులను నడిస్తున్నారు. సా మిల్లు ముందు ఉన్న ప్రధాన గేట్లకు తాళాలు వేసి, లోపల కూలీల ద్వారా పనులు చేయిస్తున్నారు. వీరు కొందరు ఫారెస్ట్‌ అధికారుల ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.

గత 15 రోజుల నుంచి కొంత మంది యజమానులు సా మిల్లులను నడిస్తున్నప్పటికీ స్థానిక అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటన్నారని ఫిర్యాదులున్నాయి. సా మిల్లుల్లో పని చేసే కూలీలకు కనీసం మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వకుండా కూలీ పనులు చేయిస్తున్నట్లు సమాచారం. అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌ కుమార్‌ను వివరణ కోరగా కొన్ని సా మిల్లులకు అనుమతి లభించలేదని, రెన్యూవల్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పనులు చేయాలని స్పష్టం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top