వెనుకబడ్డారు.. వేగం పెంచండి!

Sapling Trees Till September 15 In Haritha Haram at Nizamabad - Sakshi

సాక్షి, ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): హరితహారం కార్యక్రమంలో విధించిన లక్ష్యానికి దూరంగా ఉన్న పలు మండలాల ఉపాధిహామీ ఏపీఓలు, టీఏలు తాకీదులు అందుకోనున్నారు. ఇప్పటివరకు నమోదైన మొక్కలు నాటిన జిల్లా శాతం కంటే తక్కువ శాతం నమోదు చేసిన మండలాలను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేస్తోంది. నేడో, రేపో సంబంధిత మండలాలకు నోటీసులు వెళ్లనున్నాయి. ప్రస్తుతం ఈనెల 28 తేదీ వరకు మొక్కలు నాటిన జిల్లా యావరేజీ శాతం 66.21గా ఉంది. జిల్లా శాతానికి తక్కువగా ఉన్న కోటగిరి, డిచ్‌పల్లి, బాల్కొండ, నందిపేట్, నిజామాబాద్, రెంజల్, సిరికొండ మండలాలకు నోటీసులు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధిహామీ విభాగంతో జిల్లాలో 2కోట్ల 30 లక్షలు మొక్కలు నాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పాత మండలాల ప్రకారం మొత్తం 19 మండలాల్లోని 530 గ్రామ పంచాయతీల్లో పంచాయతీకి ఒకటి చొప్పున నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. మొక్కలు నాటడం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు 1,52,27,451 (66.21 శాతం)మొక్కలను ఉపాధిహామీ సిబ్బంది గుంతలు తీయించి కూలీలచే నాటించారు. ఇంకా 77,72,549 మొక్కలను నాటించాల్సి ఉంది. అయితే మొక్కలను నాటించడంలో పలు మండలాల ఏపీఓలు, టీఏలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఫలితంగా లక్ష్యంలో వెనుకబడి ఉన్నారు. దీంతో జిల్లా పర్సంజేటీపై ప్రభావం పడుతోంది. చాలా మండలాలు 65 శాతం మొక్కలు నాటించడం క్రాస్‌ చేయగా, కొన్ని మండలాల కారణంగా హరితహారంలో జిల్లా వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. కమ్మర్‌పల్లి మండలం 87.35 శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో ఆర్మూర్‌ 84.17శాతం, ధర్పల్లి 82.87శాతం, వేల్పూర్‌ 73.64 శాతంతో ఉన్నాయి.

సెప్టెంబర్‌ 15 వరకు లక్ష్యాలు పూర్తి చేయాలి.. 
జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని వచ్చే సెప్టెంబర్‌ 15వరకు పూర్తి చేయాలని ఉపాధిహామీ సిబ్బందికి డీఆర్‌డీఓ రాథోడ్‌ రమేష్‌ ఆదేశాలిచ్చారు. ఇందుకు బుధవారం కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, టీఏలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొక్కలు నాటడంలో లక్ష్యానికి వెనుకబడి ఉన్న మండలాలు వారం రోజుల్లో మెరుగుపరుచుకోవాలని, లేదంటే నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.
- జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం (ఫైల్‌) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top