
‘సాక్షి’కి ఎన్‌ఐఎఫ్ మీడియా అవార్డు
‘సాక్షి’ దినపత్రికకు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘మీడియా అవార్డు’ దక్కింది. ఈ అవార్డును నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్‌ఐఎఫ్) శుక్రవారం ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రికకు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘మీడియా అవార్డు’ దక్కింది. ఈ అవార్డును నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్‌ఐఎఫ్) శుక్రవారం ప్రకటించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మం త్రిత్వ శాఖ పరిధిలోని ఈ ఫౌండేషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. వ్యవసాయ పనుల్లో కాయకష్టాన్ని, సాగు ఖర్చులను తగ్గించే అనేక యంత్రపరికరాలను మారుమూల గ్రామాల్లోని అన్నదాతలు, గ్రామీణులు తమ స్వీయ పరిజ్ఞానంతో ఆవిష్కరిస్తున్నారు. ఇటువంటి అద్భుత ఆవిష్కరణలనెన్నిటినో ‘సాగుబడి’ పేజీ ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో మార్చి 7న జరిగే 8వ నేషనల్ గ్రాస్‌రూట్స్ అవార్డు ఫంక్షన్‌లో ఎన్‌ఐఎఫ్ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్‌ఏ మషేల్కర్ చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఈ అవార్డును అందుకోనున్నారు.
ప్రదర్శనకు ఏపీ, తెలంగాణ ఆవిష్కరణలు
రాష్ట్రపతి భవన్‌లో మార్చి 7 నుంచి 13 వరకు గ్రామీణుల సృజనాత్మక ఆవిష్కరణల ప్రదర్శన జరగనుంది. ప్రదర్శనకు మహిపాల్‌చారి(వరంగల్), మువ్వా కృష్ణమూర్తి(గుంటూరు), గోదాసు నర్సింహ(నల్గొండ), కె. చంద్రశేఖర్(గుంటూరు)ల ఆవిష్కరణలు ఎంపికయ్యాయి. ఈ మేరకు ‘పల్లె సృజన’ అధ్యక్షుడు పోగుల
గణేశం మీడియాకు తెలిపారు.