బస్సు భద్రమే: మంత్రి పువ్వాడ

Sakshi Interview With Puvvada Ajay Kumar

సురక్షిత ప్రయాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం

బస్సు ఎక్కేందుకు ఎవరూ భయపడాల్సిన పని లేదు

తగు జాగ్రత్తలతో ప్రయాణాలకు ముందుకురండి..

ప్రజా రవాణాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ..

రెండు నెలల్లో సానుకూల పరిస్థితులు

‘సాక్షి’తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్ ‌:  ‘రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో సిబ్బందికి వేతనాలు, ప్రజా రవాణా సంస్థకు మళ్లీ త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మరో రెండు నెలల్లో పరిస్థితి సానుకూలంగా మారుతుందని ఆశిస్తున్నాం..’అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. ‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అన్న నినాదం ఆది నుంచి ఉన్నట్టుగానే, కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా బస్సు ప్రయాణం భద్రంగా ఉండేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ప్రతి బస్సును శానిటైజ్‌ చేసిన తర్వాతనే బయటకు తీస్తున్నారు. అందులో ప్రయాణికులకు శానిటైజర్లు సిద్ధంగా ఉంచుతున్నారు. బస్సులో ప్రయాణం అంటే ప్రజలు భయపడాల్సిన పనిలేదు. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దాన్ని ప్రజలు కూడా గుర్తించాలి..’అని కోరారు. కరోనా భయంతో జనం బస్సెక్కేందుకు జంకుతున్న తరుణంలో మంత్రి పువ్వాడ ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

రెండు నెలల్లో సానుకూలత..
ప్రస్తుతం కరోనాతో ఆర్టీసీ కూడా కుదేలైంది. లాక్‌డౌన్‌కు పూర్వం ఆర్టీసీకి నిత్యం సగటున రూ.12 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అంతర్‌రాష్ట్ర సర్వీసులు, సిటీ బస్సులు తిప్పకుండా కేవలం జిల్లా సర్వీసులు మాత్రమే నడుపుతున్నాం. బస్సు కంటే సొంత వాహనంలో ప్రయాణానికే జనం ఎక్కువగా మొగ్గుచూపుతున్నందున ప్రస్తుతం రోజువారీ ఆదాయం రూ.3.5 కోట్లు మాత్రమే సగటున ఉంటోంది. కిలోమీటరుకు వచ్చే ఆదాయం కూడా గతంలో సగటున రూ.43 ఉంటే ప్రస్తుతం అది రూ.20 గానే ఉంటోంది. బస్సులు తిరిగి ప్రారంభమైన కొత్తలో ఇది మరీ తక్కువగా ఉండేది. ఇప్పుడు రాత్రి సర్వీసులు, ఇమ్లీబన్‌ స్టేషన్‌లోకి బస్సులను అనుమతించటం ప్రారంభించాక పెరిగింది. మరో 2 నెలల్లో పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఒక్కసారి శుభకార్యాలు, రాష్ట్రవ్యాప్తంగా ఇతర కార్యకలాపాలు పుంజుకుంటే ఆర్టీసీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

ఆక్యుపెన్సీ రేషియో 45 శాతానికి..
ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా నిత్యం దాదాపు 5 వేల బస్సులను తిప్పుతున్నాం. వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 45 శాతానికి చేరింది. ఇది కొంత శుభసూచకం. బస్సులను సురక్షితంగా ఉండేలా తీసుకుంటున్న చర్యలను ప్రయాణికులు కూడా క్రమంగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా.. ఎక్కడా బస్సుల వల్ల కొత్తగా కేసులు పెరిగినట్టు ఆధారాలు లేవు. ప్రభుత్వ పరంగా మేం చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బస్సుల్లో ప్రయాణానికి ముందుకు రావాలి. 

ఉద్యోగులకు ప్రభుత్వంపై అపారనమ్మకం
ఇక సిబ్బందికి వేతనాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం ఇతర విభాగాల విషయంలో వ్యవహరిస్తున్నట్టుగానే చేస్తోంది. గత మూడు నెలలుగా సిబ్బందికి 50 శాతం వేతనాలు చెల్లిస్తోంది. టికెట్ల ద్వారా ఒక్క రూపాయి కూడా రాని సమయంలో కూడా ప్రభుత్వం వేతనాలు చెల్లించింది. ఇది ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకునే చర్యలో భాగం. గతంలోనే బడ్జెట్‌లో రూ.వేయి కోట్లు కేటాయించాం. ఇక ప్రభుత్వ పూచీకత్తుతో రూ.650 కోట్ల వరకు బ్యాంకు రుణం అందింది. వీటితో సిబ్బందికి వేతనాల విషయంలో లోటు లేకుండా చూస్తున్నాం. వెరసి ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వంపై అపార నమ్మకం ఉంది. 

కేంద్రం పట్టించుకోలే..
ఇటీవల ఆత్మ నిర్భర భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇందులో ప్రజారవాణాకు చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఇది సరైన చర్య కాదు. అప్పట్లోనే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తమైంది. ఆ తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ప్రత్యేకంగా కోరాం. కానీ ఆయన పట్టించుకోలేదు. రాష్ట్రంలో తీవ్రంగా సమ్మె జరిగినపుడూ కేంద్రం ఇలాగే వ్యవహరించింది.

ఏపీకి బస్సులపై ఏ నిర్ణయం తీసుకోలేదు..
అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించనప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగితే బాగుంటుందున్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తం చేసింది. కానీ ఈ విషయంలో ఇంకా మేం నిర్ణయం తీసుకోలేదు. ఈ రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పితే ఎలా ఉంటుందన్న విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడాక తగిన నిర్ణయం తీసుకుంటాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top