‘ఓటు’ జనం

RTC Which Runs 700 Special Buses on a Single Day - Sakshi

హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు పోటెత్తిన ఓటర్లు

ఒక్క రోజే 700 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ

రద్దీ కారణంగా పలు రైళ్లలో అదనపు బోగీలు

ఒక్క రోజే 5 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు

సాక్షి, హైదరాబాద్‌: దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లు హైదరాబాద్‌ వాసులు ఓట్ల పండుగ కోసం సొంత ఊళ్లకు పోటెత్తారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ బుధవారం తారస్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గురువారమే ఎన్నికలు కావడంతో పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు బయల్దేరారు. ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను ఎక్కువ శాతం ప్రధాన రాజకీయ పార్టీలే గంపగుత్తగా బుక్‌ చేసుకుని ప్రయాణికులను తరలించాయి. దీంతో సాధారణ జనానికి ప్రైవేట్‌ బస్సు లు చాలా వరకు అందుబాటులో లేకుండా పోయా యి. ఉన్న కొద్ది పాటి బస్సుల్లోనూ చార్జీలను రెట్టింపు చేశారు. విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లోనూ ప్రయాణికులను సొంత ఊళ్లకు తరలించినట్లు సమాచారం.

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు రాకపోకలు సాగించే 3,500 ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులతో పాటు మరో 700 బస్సులను రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు అదనంగా ఏర్పాటు చేశాయి. సిటీ బస్సులను సైతం ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేష న్‌ ప్రాంతాలు జనంతో పోటెత్తాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఆర్టీసీ యథావిధిగా 50 శాతం అదనపు చార్జీలు విధించింది. బుధవారం ఒక్క రోజే సుమారు 8 లక్షల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు తరలివెళ్లినట్లు అంచనా. మొత్తంగా సుమారు 20 లక్షల మంది నగరం నుంచి వెళ్లారు. 

అదనపు బోగీలు..
మూడు రోజులుగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్‌లు పోటెత్తాయి. విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడాయి. రెగ్యులర్‌ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ భారీగా పెరిగింది. బుధవారం ఒక్క రోజే అదనంగా మూడు సాధారణ రైళ్లను నడిపారు. మరో 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సికింద్రాబాద్‌–కాకినాడ, సికింద్రాబాద్‌–తిరుపతి, లింగంపల్లి–కాకినాడల మధ్య ఏర్పాటు చేసిన సాధారణ రైళ్లలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సికింద్రాబాద్‌–గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్.

సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–విశాఖ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ– చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కాచిగూడ– రేపల్లె, సికింద్రాబాద్‌–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. ఏపీ వైపు వెళ్లే రైళ్లతో పాటు వరంగల్, కాజీపేట్, మహబూబ్‌నగర్, తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే ప్యాసింజర్‌ రైళ్లలోనూ రద్దీ పెరిగింది. బుధవారం ఒక్క రోజే సుమారు 4 లక్షల మందికి పైగా రైళ్లలో వెళ్లినట్లు అంచనా. రిజర్వేషన్‌లు లభించని ప్రయాణికులు సాధారణ బోగీల్లో వెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో పిల్లలు, పెద్దవాళ్లు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో కష్టాలను లెక్కచేయకుండా బయల్దేరి వెళ్లారు.

రెగ్యులర్‌ సర్వీసుల్లో కోత
ఏపీకి వెళ్లే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను రాజకీయ పార్టీలు గంపగుత్తగా బుక్‌ చేసుకోవడంతో బుధవారం పలు రూట్లలో ఆపరేటర్లు సర్వీసులను నిలిపేశారు. మిగిలిన సర్వీసుల్లో చార్జీలను రెట్టింపు చేశారు. మియాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగ ర్‌ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఓటర్లను వారి సొంత ఊళ్లకు తరలించారు. నిత్యం ఏపీ వైపు రాకపోకలు సాగిం చే 1000 ప్రైవేట్‌ బస్సుల్లో సగానికి పైగా రాజ కీయ పార్టీలే బుక్‌ చేసుకున్నాయని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఏజెంట్‌ తెలిపారు. వాహనాల రద్దీ వల్ల విజయవాడ, కర్నూల్, వరంగల్, తూప్రాన్‌ మార్గాల్లో ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top