డ్రైవర్‌పై ఆర్టీసీ కుట్ర..!

RTC conspiracy on the driver of Kondagattu Bus Accident  - Sakshi

     అతని తప్పిదం వల్లే ప్రమాదమని ప్రచారం 

     కమిటీ దర్యాప్తు మొదలుకాకుండానే లీకులు 

     ఆర్టీసీ తీరుపై కార్మిక సంఘాలు, కుటుంబ సభ్యుల మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: కొండగట్టు ఘోర రోడ్డు ప్రమాదం విచారణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విచారణ మొదలుకాక ముందే.. మరణించిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ను బలిపశువును చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రైవర్‌ తప్పుచేశాడంటూ స్థానిక ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఈ విషయాన్ని ఓ దినపత్రికకు లీక్‌ చేయడంపై శ్రీనివాస్‌ కుటుంబీకులు, ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆర్టీసీ అధికారులు నిందను డ్రైవర్‌పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 62 మందిని బలిగొన్న కొండగట్టు బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. దుర్ఘటనపై ఆర్టీసీ, పోలీసు, ఆర్టీఏ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వారెవరన్నది మాత్రం ప్రకటించలేదు. ఈలోగా మరునాడు ఉదయం డ్రైవర్‌ నిర్లక్ష్యమంటూ ఓ దినపత్రికలో కథనం రావడం కలకలం రేపింది. ఆర్టీసీ తన ప్రాథమిక నివేదికలో డ్రైవర్‌ అప్రమత్తం గా లేడని, బస్సును న్యూట్రల్‌లో నడిపాడని, బ్రేకుకు బదులు యాక్సిలేటర్‌ తొక్కాడని ప్రచారం ఎలా చేస్తారని శ్రీనివాస్‌ కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు.

రెండు నాల్కల ధోరణి 
నా భర్త చనిపోయిన మరునాడు స్థానిక ఆర్‌ఎం మా ఇంటికి వచ్చారు. నీ భర్త శ్రీనివాస్‌ మంచోడు అన్నడు, కుటుంబానికి అండగా ఉంటామన్నరు. కానీ, నా భర్తే ప్రమాదం చేసిండని అధికారులు పేపర్లలో రాయించారు. ఇదేం న్యాయం. 30 ఏళ్లలో ఎన్నడూ చిన్న యాక్సిడెంట్‌ కూడా చేయలేదు. 
– బూస నాగమణి, శ్రీనివాస్‌ భార్య 

డ్రైవర్‌ తప్పేం లేదు 
బస్సు ప్రమాదం జరిగినప్పుడు నేను వెనుక బస్సులో వస్తున్నా. ప్రయాణికులు దిగిపోవాలని డ్రైవర్‌ అరిచాడు. ఎదురుగా వస్తున్న రెండు వాహనాలను తప్పించాడు. తాను నిజంగా యాక్సిలేటర్‌ తొక్కితే ఈ రెండు వాహనాలను ఢీకొట్టేవాడే కదా! ఆయన తప్పు చేశాడనడం సమంజసం కాదు. 
– శేఖర్‌ (కొడిమ్యాల), ప్రత్యక్ష సాక్షి

బలి చేస్తున్నారు
దీనిపై ఆర్టీసీ యూనియన్‌ సంఘాలు కూడా స్పందించాయి.  దేశంలోనే అతిపెద్ద ప్రమాదం ఇది. చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటోందోనన్న భయంతో చనిపోయినవాడు బతికిరాడన్న ధీమాతో నేరాన్ని డ్రైవర్‌పై మోపుతున్నారు.
– నాగేశ్వరరావు (ఎన్‌ఎంయూ), రాజిరెడ్డి (ఈయూ) హనుమంత్‌ (టీజేఎంయూ)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top