ఆర్టీసీ బస్సు బోల్తా | rtc bus rolls in khammam district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా

May 22 2015 2:24 AM | Updated on Sep 3 2017 2:27 AM

ఆర్టీసీ బస్సు బోల్తా

ఆర్టీసీ బస్సు బోల్తా

ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు(రామబాణం) బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు వద్ద గురువారం అదుపుతప్పి బోల్తా పడింది.

ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదం
3 పల్టీలు కొట్టి 40 అడుగుల లోతులో పడిన బస్సు

బూర్గంపాడు: ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు(రామబాణం) బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు వద్ద గురువారం అదుపుతప్పి బోల్తా పడింది. అప్రోచ్‌రోడ్ పైనుంచి మూడు పల్టీలు కొట్టి సుమారు 40 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తోపాటు ఓ మహిళ మృతి చెందగా 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. భద్రాచలం నుంచి సారపాక వైపునకు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి ఓ ఫెన్సింగ్ పోల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.


ఘటనాస్థలం క్షతగాత్రుల రోదనలతో విషాదమయమైంది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో దుమ్ముగూడెం మండలం సింగారం గ్రామానికి చెందిన బొడ్డు శ్రావణి బస్సులోనే మృతి చెందింది. ఆమె భర్త లక్ష్మీనారాయణ, పిల్లలు శ్రావణ్‌కుమార్, గాయత్రికి కూడా తీవ్రగాయాలయ్యాయి.


తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ సీహెచ్ వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. క్షతగాత్రుల్లో రవి, వాణి, పద్మ, డి.హస్లీ, గాయత్రి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, హైదరాబాద్‌లకు తరలించారు. ఘటనా స్థలిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పరిశీలించారు. అంతకుముందుగా భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు కూడా బాధితులను పరామర్శించడంతో పాటు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement