రేపు రైతుల ఖాతాల్లోకి ‘పెట్టుబడి’ 

Rs 500 crore for Five lakh farmers in raitubandhu scheme - Sakshi

ఐదు లక్షల మంది రైతులకు రూ.500 కోట్లు 

ఇప్పటికే 13 లక్షల ఖాతా నంబర్ల సేకరణ

నెలలోగా 52 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సొమ్ము 

సాక్షి, హైదరాబాద్‌: రబీ రైతుబంధు సొమ్ము పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సీజన్‌లో మొదటిదశ పెట్టుబడి సొమ్మును సోమ వారం రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ధ్రువీకరించారు. ఐదు లక్షలమంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.500 కోట్లు బదిలీ చేయనున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ప్రభుత్వం రూ.5,100 కోట్లు పంపిణీ చేసింది. మొత్తం 51 లక్షల మంది రైతులకు గ్రామసభల్లో పెట్టుబడి చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేయొద్దని, నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్మును అందజేయాలని ఎన్నికల కమిషన్‌ తేల్చిచెప్పడంతో బదిలీ ప్రక్రియ చేపట్టింది.  

13 లక్షల బ్యాంకు ఖాతాల సేకరణ... 
రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేపనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) 13 లక్షలు సేకరించారు. వాటిని మరోసారి పరిశీలించాక ఎటువంటి అభ్యంతరాల్లేని ఖాతాలు ఐదు లక్షలు మండల వ్యవసాయ అధికారుల(ఏవో) వద్దకు చేరాయి. వాటిని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసింది. ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపారు. వాటిని సరిచూసుకున్న ఆర్థికశాఖ సోమవారం ఆయా బ్యాంకు ఖాతాలకు రైతుబంధు సొమ్ము బదిలీ చేయనుంది.  

నెలలోగా పూర్తి చేసే ప్రణాళిక...  
మొదటిదశలో ఐదు లక్షలమంది రైతులకు పెట్టుబడి సొమ్మును బదిలీ చేశాక, తదుపరి వారంరోజుల్లోనే మరో విడత సొమ్ము అందజేసేలా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. నెల రోజుల్లోగా మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము చేరనుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాతాల సేకరణ, సొమ్ము బదిలీ పనిలో దాదాపు 2,400 మంది ఏఈవోలు నిమగ్నమయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top