ఆర్టీసీకి పండుగే పండుగ!

Rs 135 crores income to RTC with Sankranti festival  - Sakshi

సంక్రాంతి ఆదాయం రూ.135 కోట్లు 

లక్ష్యాన్ని చేరుకున్న అధికారులు 

గతేడాది కన్నా రూ.4.57 కోట్లు అదనపు ఆదాయం 

సాక్షి, హైదరాబాద్‌: నష్టాల్లో ఆర్టీసీ సంక్రాంతితో కలెక్షన్ల పండుగ చేసుకుంది. ఈసారి ఏకంగా రూ.135 కోట్ల కలెక్షన్లతో ఆర్టీసీ వసూళ్లు కలకలలాడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి రూ.4.57 కోట్లు అధిక వసూళ్లు రాబట్టింది. జనవరి 10 నుంచి 15 వరకు తెలంగాణ, ఏపీల్లోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా సర్వీసులు నడిపింది. ఇందుకు 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసింది. ఆర్టీసీ అధికారులు ఈసారి రూ.130 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నా దాన్ని సునాయాసంగా అధిగమించారు. 

గతేడాది కన్నా అధికం.. 
ఈ సారి సంక్రాంతికి ఏపీతో పాటు తెలంగాణ పల్లెలకు పెద్ద ఎత్తున హైదరాబాద్‌వాసులు తరలివెళ్లారు. ముఖ్యంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో పెద్ద ఎత్తున తెలంగాణవాసులు పల్లెబాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 5,252 ప్రత్యేక సర్వీసులను హైదరాబాద్‌ నుంచి నడిపింది. ఇందులో 1,560 ఏపీకి, 3,600 పైగా బస్సులను తెలంగాణలోని జిల్లాలకు నడిపింది. రూ.63.36 కోట్లు వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇదంతా అప్‌ జర్నీదే కావడం గమనార్హం. ఈ లెక్కన 10 నుంచి 15 వరకు 6 రోజుల పాటు రోజుకు రూ.10.33 లక్షలు వచ్చినట్లు అధికారులు వివరించారు. 16 నుంచి 21 వరకు రివర్స్‌ జర్నీ వసూళ్లు రూ.72 కోట్లు వచ్చాయి. రోజుకు రూ.12 లక్షల చొప్పున వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 21న పంచాయతీ ఎన్నికలు జరగడం కూడా ఆర్టీసీకి కలిసొచ్చింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌ నుంచి పెద్దఎత్తున జనం వెళ్లారు. 

ఏపీకి భారీ వసూళ్లు.. 
ఏపీఎస్‌ ఆర్టీసీతో పోలిస్తే.. టీఎస్‌ఆర్టీసీ ఆదాయం సగమే కావడం గమనార్హం. ఏపీఎస్‌ ఆర్టీసీకి గతేడాది ఆదాయంతో పోలిస్తే రూ.10 కోట్లు అదనపు ఆదాయం రాగా, టీఎస్‌ ఆర్టీసీకి రూ. 4.57 కోట్లే ఆదాయం వచ్చింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఏపీఎస్‌ఆర్టీసీ 2,600 బస్సులు నడపగా, హైదరాబాద్‌ నుంచి ఏపీకి టీఎస్‌ఆర్టీసీ 1,560 బస్సులనే నడిపింది. ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ల ధరలు అధికంగా వసూలు చేయడం, హైదరాబాద్‌ నుంచి తెలంగాణ కన్నా ఎక్కువ సర్వీసులు నడపడంతో అధిక వసూళ్లు సాధించడంలో ఏపీఎస్‌ఆర్టీసీ సఫలీకృతమైంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top