ప్రగతిలో పట్టణాలదే ప్రముఖపాత్ర

Review Meeting Over The Urban Development By KTR - Sakshi

పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పట్టణాభివృద్ధి సంస్థల పనితీరుపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రగతిలో పట్టణాలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో ప్రస్తుతం 43 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, అతి కొద్దికాలంలో ఇది 50 శాతం దాటుతుందని అన్నారు. పట్టణీకరణ, జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)లు పనిచేయాల్సి ఉందని అన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌లను రూపొందించాలని ఆదేశించారు.

గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, అధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయడం యూడీఏల ప్రాథమిక విధి అని, ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. వరంగల్‌ పట్టణాభివృద్ధి సంస్థ తయారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రచురణకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో అవలంభించిన విధివిధానాల అధ్యయనానికి శుక్రవారం డీటీసీపీ, పురపాలక శాఖ అధికారులతో సమావేశం కావాలని అన్నారు.

స్వయం సమృద్ధే లక్ష్యం.. 
పట్టణాభివృద్ధి సంస్థలు స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం ల్యాండ్‌ పూలింగ్‌–అభివృద్ధి విధానం తదితర మార్గాలను అనుసరించాలన్నారు. సొంతంగా ఆర్థిక వనరులను సమకూర్చుకునే దిశగా పట్టణాభివృద్ధి సంస్థలు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూములతో కూడిన భూనిధి వివరాలను సేకరించాలన్నారు. హెచ్‌ఎండీఏ వినూత్న ఆలోచనలు, విధానాలతో సమర్థవంతంగా పనిచేస్తోందని, మిగతా సంస్థలూ వీటిని అమలు చేయాలన్నారు.

కొత్త పురచట్టం నేపథ్యంలో హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధి సంస్థల చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుచేర్పులపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్‌లు మర్రి యాదవరెడ్డి(వరంగల్‌), రామకృష్ణారావు(కరీంనగర్‌), రవీందర్‌రెడ్డి(సిద్దిపేట), ప్రభాకర్‌రెడ్డి(నిజామాబాద్‌), పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top