అంతు లేని నిర్లక్ష్యం!

Revenue Officer Neglene Farmers Problems Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : భూప్రక్షాళన ఫలితాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. చేసిన తప్పులు సరిదిద్దుకోలేని రెవెన్యూ ఉద్యోగులు.. మరో పక్క కాసుల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒంట్లో సత్తువ లేక, అయినవారు ఎవరూ తోడు లేని అభాగ్యులు, రెక్కాడితే డొక్కాడని నిరుపేదలను సైతం వదలకుండా డబ్బుల కోసం పీడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు... అంతులేని పొరపాట్లు చేసి, పాస్‌పుస్తకంలో సవరణచేయాలన్నా.. పుస్తకం ఇవ్వాలన్నా చేయి తడపాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ కర్షకుల కన్నీటికి కారణమవుతున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి.

అవసరాలు తీరక... 
పెట్టుబడికి అవసరమైన అప్పు కోసమే.. లేక లేక అమ్ముకుని అవసరాలు తీర్చుకునేందుకు భూమే ఆధారంగా ఉన్న రైతులకు భూప్రక్షాళన ఇబ్బందులను తెచ్చిపెట్టింది.  నిత్యం వందలాది మంది పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత సంవత్సరం వరకు చేతులో పట్టాదారు పాసుపుస్తకాలున్న చాలా మంది రైతులకు ఇప్పుడు కొత్త పాస్‌పుస్తకాలు అందలేదు. దీంతోబ్యాంకు రుణాలు దేవుడెరుగు... ప్రైవేట్‌ అప్పులూ పుట్టడం లేదు. అంతంత మాత్రంగా ఉన్న పంటలను రక్షించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు రుణం కోసం బ్యాంకులకు వెళ్లగా బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు.

శాపంగా భూప్రక్షాళన 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళనలో చోటు చేసుకున్న తప్పులు రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. తప్పొప్పుల సవరణకు ప్రభుత్వం గడువు ఇచ్చినా అధికారులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయకపోవడంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు చేతికి రాకపోగా రైతుబంధు పథకానికీ దూరమవుతున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లిన వారితో పాటు పార్ట్‌–బీ(వివాదాస్పదమైనవి)లో ఉన్న భూముల విషయం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూరిజిస్ట్రేషన్లు, ముటేషన్ల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టగా ఆశించిన ఫలితాలు రాలేదు. రికార్డుల ప్యూరిఫికేషన్‌ అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. ఈ సందర్బంగా చోటు చేసుకున్న తప్పులను సవరించే ప్రక్రియ నేటికీ పూర్తి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఎన్నికల విధుల్లోకి 
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సాధారణ విధులకు దూరమైన అధికారుల తీరుతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమాన్ని సగంలోనే వదిలి అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్తున్న రైతులకు ‘ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నాం.. ఆగాల్సిందే’ అన్న సమాదానం వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కలెక్టర్‌ కార్యాలయానికి పట్టాదారు పాస్‌పుస్తకాలిప్పించాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో సోమవారం  దేవరకద్ర, అడ్డాకులల్లో ఆందోళన చేసిన రైతులు మంగళవారం హన్వాడ, మద్దూరులో నిరసన తెలిపారు.

జేబు నింపితేనే.... 
వీఆర్వో లేరు, తహసీల్దార్‌ సమావేశంలో ఉన్నారు... మ ళ్లీ రండనే సమాధానాలతో పాస్‌పుస్తకాలకోసం వెళ్లిన రై తులు నిత్యం ఎదుర్కొంటున్నారు. అయితే, అక్కడ అడిగినంత ముట్టజెప్పితే మాత్రం పాస్‌పుస్తకం వెంటనే చే తికి వస్తోందని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. ముడుపు ముట్టజెప్పుకోకపోతే పాస్‌పుస్తకం ఊసెత్తడం లేదని రైతులు బహిరంగంగా పేర్కొంటున్నారు. 

జిల్లాలో 35,885 సవరణలు 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో రికార్డుల ప్యూరిఫికేషన్‌ నిర్వహించిన అనంతరం కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సమయంలో పాస్‌పుస్తకాల్లో విపరీతంగా తప్పులు దొర్లడంతో సరిచేసి ఇస్తామని రైతుల నుండి పాస్‌బుక్‌లు, చెక్కులు తిరిగి తీసుకున్నారు. ఇలా జిల్లాలో 35,885 తప్పులను గుర్తించారు. అనంతరం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులు సరిచేయక, చెక్కులు, పాస్‌బుక్కులు అందజేయకపోవడంతో రైతులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top