ఓరుగల్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ

Reorganization of Warangal districts - Sakshi

హన్మకొండ జిల్లాగా వరంగల్‌ అర్బన్‌

వరంగల్‌ జిల్లాగా వరంగల్‌ రూరల్‌

రెండు జిల్లాల కూర్పు, పేర్లలో మార్పు

ప్రజా విజ్ఞప్తుల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం 

త్వరలో ఉత్తర్వులు జారీ

యథాతథంగా గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓరుగల్లు జిల్లాల నామస్వరూపాలు మారనున్నాయి. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల కూర్పు, పేర్లను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మార్చబోతోంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ రెండు జిల్లాలను మళ్లీ పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా, వేగంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 11న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్వహించి వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలతో సహా రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 10 నుంచి 31కు పెరిగింది. ఇటీవల కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. అయితే స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను మళ్లీ పునర్విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్‌ తూర్పు, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రజలు తమకు వరంగల్‌ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రజలందరికీ వరంగల్‌ నగరంతోనే సంబంధాలున్నాయి. చదువులు, వ్యాపారాలు, వైద్యం, ఇతర అవసరాల కోసం వారు నిత్యం వరంగల్‌ వస్తుంటారు. వరంగల్‌ రాజధానిగానే చాలా ఏళ్లపాటు జీవనం సాగింది. ఇది ఇలాగే కొనసాగాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. వరంగల్‌లోనే రైల్వే స్టేషన్, బస్‌ స్టేషన్, ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీ, ఎనుమాముల మార్కెట్‌ ఉన్నాయి. విమానాశ్రయం కూడా పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్‌ రూరల్‌ జిల్లాకు వరంగల్‌ను రాజధానిగా చేయాలనే డిమాండ్‌ స్థానికంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని కూడా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కలిపి వరంగల్‌ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పేరుకు వరంగల్‌ అయినప్పటికీ వరంగల్‌లో ఒక్క ప్రభుత్వ కార్యాలయమూ లేకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతున్నది. కాకతీయల కాలం నుంచి వరంగల్‌ రాజధానిగా వెలుగొందింది. కాబట్టి వరంగల్‌ రాజధానిగా ఒక జిల్లా ఉండటం సముచితమని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి, వరంగల్‌–హన్మకొండ నగరాలకున్న ప్రాధాన్యత, ప్రజల సౌకర్యార్థం, ప్రజాభీష్టం మేరకు వరంగల్, హన్మకొండ జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. వరంగల్‌ జిల్లా కార్యాలయాలన్నీ వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోనే ఏర్పాటు కానున్నాయి. 

హన్మకొండ జిల్లాగా వరంగల్‌ అర్బన్‌... 
వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌ మాదిరిగానే హన్మకొండకు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. హన్మకొండ నగరం కాకతీయుల తొలి రాజధాని. కానీ నేడు హన్మకొండ పేరే కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. హన్మకొండకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా హన్మకొండ కూడా ఒక జిల్లాగా ఉండాలని, వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ రాజధానిగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వరంగల్‌ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వరంగల్‌ పేరును, హన్మకొండ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు హన్మకొండ పేరును పెట్టాలని కోరారు. దీనివల్ల వరంగల్, హన్మకొండ నగరాలకున్న ప్రాధాన్యత, చారిత్రక గుర్తింపును పునరుద్ధరించినట్లు అవుతుందని భావించి సీఎం కేసీఆర్‌ సైతం సానుకూలంగా స్పందించారు. రెండు చోట్లా ప్రభుత్వ కార్యాలయాలు రావడం వల్ల నగరం నాలుగు దిక్కులా అభివృద్ధి చెందుతుందని, వరంగల్‌ నగరానికి వచ్చే వలసలు కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది.  

యథాతథంగా జీవీఎంసీ! 
వరంగల్, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ వరంగల్‌ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)ను మాత్రం యథాతథంగా అదే పేరుతో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ప్రస్తుతం 5 జిల్లాల్లో విస్తరించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి నగరాలు సైతం అనేక జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వరంగల్‌ నగరం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాబట్టి వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్ని జిల్లాలు వచ్చినా నష్టం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top