అమరుల త్యాగాలను గుర్తుంచుకోవాలి

Remember the sacrifices of martyrs - Sakshi

వారి స్ఫూర్తితో పోలీసులు ముందుకెళ్లాలి

పీపీపీ పద్ధతిలో ప్రజలకు చేరువవ్వండి

పోలీసు అమరవీరుల దినోత్సవంలో గవర్నర్‌ సూచన

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: డీజీపీ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను అందరూ గుర్తుంచుకోవాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు. దేశ అంతర్గత భద్రతకు ఆత్మ సమర్పణ చేసిన అమరుల త్యాగస్ఫూర్తితో పోలీసుశాఖ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆదివారం(అక్టోబర్‌ 21) పోలీస్‌ అమరువీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గోషామహల్‌ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పోలీస్‌ అమరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ అమరవీరుల బుక్‌లెట్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్‌ అంజనీకుమార్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. పోలీస్‌లను హేళన చేయడం సులభమేనని.. కానీ వారి త్యాగాలను అర్థం చేసుకోకపోవడమే దురదృష్టకరమన్నారు. పోలీసులు ప్రజలతో పీపీపీ (పబ్లిక్‌–పోలీస్‌ పార్ట్‌నర్‌షిప్‌) పద్ధతిలో కలిసి పనిచేస్తే అంతర్గత శత్రువులను సులభంగా నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో పోలీస్‌ బలగాలను ‘వాల్‌ ఆఫ్‌ పీస్‌’గా అభివర్ణించారు. ఛత్తీ స్‌గఢ్‌ గవర్నర్‌గా ఉన్నపుడు.. ఎన్నో పోలీసు అమరువీరుల కుటుంబాలను చూశానని, 25ఏళ్ల యువతులు భర్తలను కోల్పోవడం కలచివేసిందన్నారు. అయినా ఆ కుటుంబాలు ధైర్యంగా జీవిస్తున్నాయని, పోలీస్‌శాఖ వారి కుటుంబీకులను కంటికి రెప్పలా కాపాడుకుంటోందని గవర్నర్‌ ప్రశంసించారు. 

అమరుల కుటుంబాలకు అండగా.. 
పోలీస్‌ అమరవీరుల త్యాగాలను ఎన్నటికీ మరచిపోమని, ఆ కుటుంబాలకు పోలీస్‌శాఖ అం డగా నిలుస్తోందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో అమరులైన ఇద్దరు కానిస్టేబుళ్లు బొప్పనపల్లి సుశీల్‌కుమార్, లఖపతిల ను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా గడిచిన ఏడాదిలో 414 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, వారందరినీ గుర్తుచేసుకుంటూ..వారి త్యాగాల స్ఫూర్తితో మరిం త ధైర్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో తెలంగాణ పోలీస్‌ ముందు వరసలో ఉందని డీజీపీ అన్నారు. పోలీస్‌ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన కానిస్టేబుల్‌ కుటుంబాలకు రూ.40 లక్షలు, ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ వారికి రూ.50 లక్షలు, ఎస్పీ స్థాయి అధికారులకు రూ.కోటి, హోంగార్డులకు రూ.35 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌లు, అదనపు డీజీపీలు, ఐజీ లు, డీఐజీలు, ఎస్పీలు, కమాండెంట్లు అధికారులు పాల్గొని అమరువీరులకు నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top