రియల్‌ జోరు | Real Estate Land Demand In Zaheerabad | Sakshi
Sakshi News home page

రియల్‌ జోరు

Mar 5 2019 12:20 PM | Updated on Mar 5 2019 12:21 PM

Real Estate Land Demand In Zaheerabad - Sakshi

పంట పొలాల పక్కనే చేసిన ప్లాట్లు

సాక్షి, జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ నియోజకవర్గంలో ‘రియల్‌’ జోరు కొనసాగుతోంది. పట్టణం నుంచి పల్లెటూళ్ల వరకు ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. నియోజకవర్గానికి నిమ్జ్‌ రాబోతుండడంతో భూముల రేట్లకుఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయని, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జహీరాబాద్‌ పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుంది.  

పట్టణానికి హైదరాబాద్‌ వంద కిలో మీటర్ల దూరంలో ఉంది.  మహీంద్ర అండ్‌ మహీంద్రతో పాటు చక్కెర కర్మాగారం, ఇతర  పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లో (జాతీయ పరిశ్రమల ఉత్పాదక మండలి) నిమ్జ్‌ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లో ఇప్పటికే నిమ్జ్‌ కోసం 3 వేల ఎకరాల భూమిని సేకరించింది. మరో 9 వేల ఎకరాలు సేకరించనుంది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎకరా రూ. 5లక్షల నుంచి రూ.8 లక్షలు పలకగా ప్రస్తుతం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ.కోటికి పైనే పలుకుతున్నాయి. హైదరాబాద్‌ తదితర ప్రాంతాల వ్యాపారులు అధిక ధర చెల్లించి ఇక్కడ భూములను కొంటున్నారు.

రియల్‌ వ్యాపారంపై ఆసక్తి

వ్యాపారులు జహీరాబాద్‌ ప్రాంతంలో వెంచర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రహదారి, బైపాస్‌ రోడ్డులోని భూముల్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నారు. జహీరాబాద్‌ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నాయి.   చిన్నహైదరాబాద్, హోతి(కె), కాసీంపూర్, పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, దిడ్గి తదితర గ్రామాల పరిధిలో జహీరాబాద్‌– హైదరాబాద్, జహీరాబాద్‌–బీదర్, జహీరాబాద్‌ బైపాస్, అల్లానా రోడ్లలో వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్లాట్లు చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి.

నిబంధనలు ఇలా..

పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేయడానికి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమి రిజిస్ట్రేషన్‌ విలువల్లో పది శాతం నాలా రుసుము కింది చెల్లించాలి. ఆ తరువాత ఫైల్‌ను తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆర్డీఓ కార్యాలయం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తున్నట్లు పత్రం జారీ చేస్తారు.  సంబంధిత భూ యజమాని వెంచర్‌ కోసం 40 ఫీట్స్‌తో ప్రధాన రోడ్డు, 33 ఫీట్స్‌తో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్‌ దీపాలు, తాగునీటి వసతులు కల్పించాలి. పార్కు, డంపింగ్‌  యార్డు, అంగన్‌వాడి కేంద్రాల కోసం మున్సిపల్, పంచాయతీల పేరున భూమిలో 10 శాతం రిజిస్ట్రేషన్‌ చేయించాలి. మున్సిపల్, పంచాయతీలు, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకుని ప్లాట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది.

అనుమతులు లేకుండానే..

జహీరాబాద్‌ ప్రాంతంలో వెలుస్తున్న వెంచర్లలో అధికశాతం అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్‌– హైదరాబాద్‌ రహదారిలోని అనేక వెంచర్లు పంట పొలాల్లోనే వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లు మాత్రం అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతుండగా చిన్న చిన్న వెంచర్లు నామమాత్రపు అనుమతులు తీసుకుని పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు ఆ తరువాత ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వెంచర్లతో మున్సిపల్, పంచాయతీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement