కొత్త రేషన్‌షాపులపై ఆశలు

Ration Shops In Telangana Khammam - Sakshi

ఖమ్మం సహకారనగర్‌: ఇటీవల నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో..కొత్తగా రేషన్‌ షాపులు కూడా సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందుకవసరమైన కసరత్తు చేయాల్సిందిగా సూచించడంతో..ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పౌరసరఫరాల శాఖ ద్వారా అందించే రేషన్‌ సరుకులను మరింత చేరువ చేయాలని భావిస్తోంది. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులు, రేషన్‌ దుకాణాలు, కార్డుల వివరాలపై సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 427 గ్రామ పంచాయతీల్లో 669 రేషన్‌ దుకాణాలున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 500జనాభా కంటే ఎక్కువ ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది.

దీంతో జిల్లాలో మరో 157కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వాటిల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు..గ్రామ పంచాయతీలు, దుకాణాల వివరాలతో పాటు స్థానికంగా ఉన్న కార్డుల వివరాలపై పరిశీలన చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో 500కార్డుల కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో సైతం రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు.

జిల్లాలో కొత్తగా 80దుకాణాలు..?  
జిల్లాలో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో సుమారు 80రేషన్‌ దుకాణాలు ఏర్పాటయ్యే అవకాశముంది. గతంలో 427 గ్రామ పంచాయతీల్లో 669 దుకాణాలుండగా, పెరిగిన 157 గ్రామ పంచాయతీల్లో 80దుకాణాలు మాత్రమే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీనిపై పౌరసరఫరాలశాఖాధికారులు గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు ఏమైనా అవసరం ఉంటాయా...? ఉంటే వాటి వివరాలు అందజేయాలని కోరారు. అధికార యంత్రాంగం మాత్రం సుమారు 60నుంచి 80రేషన్‌ దుకాణాలు అవసరం ఉండొచ్చని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

కార్డుల సంఖ్య కనీసం 500 ఉండాలనే నిబంధన ఉంది. నూతనంగా ఏర్పాటైన కొన్ని గ్రామ పంచాయతీల్లో 200కుటుంబాలు కూడా ఉండట్లేదు. ఇక్కడ డీలర్‌కు నష్టం వాటిల్లే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 80దుకాణాల వరకే ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో కొత్తగా రేషన్‌దుకాణాల ఏర్పాటు, అక్కడి పరిస్థితులు, కొత్తగా ఏర్పడనున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే శిరోధార్యం కానుంది.

జిల్లాలో రేషన్‌కార్డుల వివరాలు ఇలా..
 మొత్తం కార్డులు      3,95690 
ఆహారభద్రత           3,69,087 
అంత్యోదయ           26,575 
అన్నపూర్ణకార్డులు   2

నివేదిక సమర్పిస్తాం.. 
జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో..ఇందుకనుగుణంగా రేషన్‌ షాపులు కూడా అవసరమవుతాయి. అయితే జనాభా ఆధారంగా ఎన్ని కావాలనే విషయాలపై కసరత్తు చేస్తున్నాం. ఈ మేరకు తహసీల్దార్లను వివరాలు కోరాం. దీని ఆధారంగా..ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఖమ్మం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top