‘రేషన్‌’.. డిజిటలైజేషన్‌

Ration Has Becoming Digitalization In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : నగదు రహిత లావాదేవీలకు రేషన్‌ దుకాణాలు వేదికలుగా మారాయి. కార్డులపై వినియోగదారులకు ఇప్పటివరకు బియ్యం, పంచదార వంటి సరుకులను పంపిణీ చేసిన దుకాణాలు.. ఈ నెల నుంచి బహుళ సేవలు అందించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ సజావుగా సాగేందుకు.. రేషన్‌ దుకాణాల్లో సరుకులు  తీసుకునే వినియోగదారులు ఇతర సేవలు ఇక్కడి నుంచే పొందేందుకు అవకాశం కల్పించడం వల్ల ఇటు వినియోగదారులకు.. అటు డీలర్లకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం ప్రత్యేకంగా టీ–వాలెట్‌ను ఏర్పాటు చేసింది.

దీని ద్వారా వినియోగదారులకు డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 669 రేషన్‌ దుకాణాలు ఉండగా.. కార్డులు 4,07,622 ఉన్నాయి. వీటికి నెలవారీగా 64,29,346 కేజీల బియ్యం సరఫరా అవుతుంది. గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా 9 రకాల వస్తువులు సరఫరా చేసేవారు. బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, నూనె, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి వంటివి రేషన్‌ కార్డుదారులకు అందించేవారు.

అయితే ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తున్నారు. పంచదార కూడా అంత్యోదయ కార్డులున్న వారికే ఇస్తున్నారు. దీనివల్ల రేషన్‌ డీలర్లు బియ్యం ఒక్కటే అమ్ముతున్నందున తమకు కమీషన్‌ సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా మరిన్ని సేవలను అందించడం వల్ల డీలర్లకు కమీషన్‌ పెంచడంతోపాటు డిజిటల్‌ లావాదేవీలను ప్రజలకు అలవాటు చేయవచ్చనే ఉద్దేశంతో వాటిని అందుబాటులోకి తెచ్చింది. 

అందుతున్న సేవలివే..
రేషన్‌ దుకాణాల ద్వారా వినియోగదారులకు సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. చిన్న మొత్తంలో లావాదేవీల కోసం బ్యాంక్‌కు కానీ.. మీసేవ కేంద్రానికి కానీ వెళ్లాల్సి వచ్చేది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత జనం ఎక్కువగా ఉంటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చిన్న మొత్తంలో లావాదేవీలు చేయాలంటే రేషన్‌ దుకాణానికి వెళితే చాలు.. అక్కడ మన పని క్షణాల్లో చేసుకునే సదుపాయం కల్పించారు.

రూ.2వేలలోపు లావాదేవీలను ఇక్కడ చేసుకునే వీలు కల్పించారు. ఈ నెల నుంచి రేషన్‌ దుకాణాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంతో వినియోగదారులకు డిజిటల్‌ లావాదేవీలు చేసుకోవడం ఇక సులువుగా మారింది. రేషన్‌ దుకాణాల్లో టీ–వాలెట్‌ విధానం ద్వారా మొబైల్‌ రీచార్జి, నగదు బదిలీ, డీటీహెచ్, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, బస్‌ టికెట్‌ బుకింగ్, ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ చార్జీలు, ఆధార్‌ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినందుకు రేషన్‌ డీలర్లకు కమీషన్‌ చెల్లించనున్నారు. దీంతో రేషన్‌ డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం కలగనున్నది.  

ప్రారంభమైన సేవలు
జిల్లాలోని రేషన్‌ దుకాణాల్లో ఈ డిజిటల్‌ సేవలు ప్రారంభమయ్యాయి. గత నెలలో ఒక రోజుపాటు ఈ లావాదేవీలపై రేషన్‌ డీలర్లకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే డీలర్లు లావాదేవీలు ఎలా చేయాలో శిక్షణ పొందడంతో రేషన్‌ దుకాణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అయితే వీటిని కొత్తగా ప్రవేశపెట్టడం.. కొందరు డీలర్లకు దీనిపై ఇంకా పూర్తి అవగాహన లేకపోవడంతో పూర్తిస్థాయిలో లావాదేవీలు జరగడం లేదు. దీనిపై రేషన్‌ డీలర్లు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వారికి అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో సూచనలు చేసి.. లావాదేవీలు నిర్వహించేలా చూడనున్నారు. 

టీ–వాలెట్‌ సేవలు అందిస్తున్నాం..
రేషన్‌ దుకాణాల్లో టీ–వాలెట్‌ ద్వారా సేవలు అందిస్తున్నాం. అయితే ఇప్పుడే కొత్త కావడంతో వినియోగదారులు పూర్తిస్థాయిలో అలవాటు కాలేదు. రేషన్‌ దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విధానం వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.         
 – షేక్‌ ఇబ్రహీం, రేషన్‌ డీలర్

పటిష్టంగా అమలు చేస్తాం..
రేషన్‌ దుకాణాల్లో టీ–వాలెట్‌ను అమలు చేసేందుకు ఇటీవల డీలర్లకు శిక్షణ ఇచ్చాం. ఈ నెల నుంచి రేషన్‌ దుకాణాల్లో టీ–వాలెట్‌ ద్వారా లావాదేవీలు చేయిస్తున్నాం. ఏ ప్రాంతంలోనైనా టీ–వాలెట్‌ అమలు కాకపోతే మరోసారి డీలర్లకు సూచనలు చేసి పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– అనిల్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top