పుష్కర పనులు నిష్ఫలం | pushkara fuds wated in karimnagar district | Sakshi
Sakshi News home page

పుష్కర పనులు నిష్ఫలం

Aug 10 2015 7:33 AM | Updated on Sep 3 2017 7:10 AM

పుష్కర పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. బిల్లులు నిలిపివేస్తాం. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతాం

  •       నిధులు నీళ్లపాలు
  •      నాసిరకం పనులు
  •      కుంగిపోతున్న ట్యాంకులు
  •  'పుష్కర పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. బిల్లులు నిలిపివేస్తాం. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతాం' ఇవీ పదేపదే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ నోటి వెంట వచ్చిన హెచ్చరికలు. ఆదరాబాదరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలాయి. నాణ్యత లోపించి నీళ్లట్యాంకులు కుంగిపోయాయి. భూములోకి కూరుకుపోతున్నాయి.         -
     
    కరీంనగర్ (ధర్మపురి) :
     పుష్కర సంబరాల హోరు మరిచిపోనేలేదు. పుష్కర ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన పనులు నాణ్యతాలోపంతో వెక్కిరిస్తున్నాయి. ధర్మపురి సోమవిహార్ పుష్కరఘాట్ వద్ద కుంగిపోయిన నీటిట్యాంక్, నెర్రెలుబారిన సీసీరోడ్లు నాణ్యతలోపానికి సాక్షిగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఉండాల్సిన నిర్మాణాలు పట్టుమని పది రోజులకే కూలే దశకు చేరుకున్నాయి.  
     రూ. కోటితో తాగునీటి ట్యాంక్‌లు
     ధర్మపురికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.కోటితో తాగునీటి ట్యాంక్‌లు నిర్మించారు. పుష్కర భక్తులతోపాటు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు నెలల ముందుగానే నిధులు విడుదల చేసిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నత్తనడకన సాగాయి. పుష్కరాలు దగ్గరపడడంతో ఆదరాబాదరగా చేసేశారు. ధర్మపురితోపాటు రాయపట్నం, తిమ్మాపూర్ గ్రామాల్లో దాదాపు  30 వరకు తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ధర్మపురిలో 20 వేల లీటర్ల సామర్థ్యం గల 20 ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రూ.2.60 లక్షలతో పనులు చేపట్టారు. వీటితో పాటు రాయపట్నం, తిమ్మాపూర్ గోదావరి తీరాలలో 5 వేల లీటర్ల సామర్థ్యం గల 10 చిన్నట్యాంకులను ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రూ.60 వేలు వ్యయం చేశారు.  
     కుంగుతున్న ట్యాంకులు
     తాగునీటి ట్యాంకులు చూసేందుకు అందంగానే కనిపిస్తున్నాయి. పుష్కరాలు ముగిసి పది రోజులు కాలేదు. ట్యాంకులు నేలకు కుంగిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో భూమి మెత్తబడి ట్యాంకులు ఒకవైపు వంగి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ధర్మపురి సంతోషిమాత, మంగలిగడ్డ, సోమవిహార్ ఘాట్ల వద్ద 30 ట్యాంకుల్లో 9 ఇక్కడే ఏర్పాటు చేశారు. 20 వేల లీటర్ల సామర్థ్యం గల 9 ట్యాంకులు గోదావరి ఒడ్డున నిర్మించారు. వాటిలో ప్రస్తుతం మూడు ట్యాంకులు భూమిలో కుంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెద్దట్యాంకులకు రూ.2.60 లక్షలు, చిన్నట్యాంకులకు రూ.60 వేలు వెచ్చించారు.
     కమీషన్ల పర్వం
     పుష్కరాల పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఒక్కరూ పనుల వద్ద కనిపించలేదు. కమీషన్లకు కక్కుర్తిపడి గుత్తేదారులు సబ్‌కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడంతో పనులు ఇలా మారారుు. నాణ్యతాలోపంతో వెక్కిరిస్తున్న ట్యాంకుల పరిస్థితిపై ఎవరూ సమాధానం చెబుతారోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement