చుండూరు తీర్పుపై ప్రజా సంఘాల ఆగ్రహం

చుండూరు తీర్పుపై  ప్రజా సంఘాల ఆగ్రహం


ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా

 

సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో దళితులను ఊచకోత కోసిన ఘటనలో హైకోర్టు నిందితులను నిర్దోషులుగా తేల్చి తీర్పు చెప్పడాన్ని నిరసిస్తూ  బుధవారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలు ప్రజా, దళిత సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. చుండూరు  నేరస్తులను నిర్దోషులుగా ఎలా నిర్ధ్దారిస్తారని ప్రశ్నించారు. విరసం నాయకులు వరవరరావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షులు వేదకుమార్, కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహేశ్వర్‌రాజ్, అరుణోదయ రామారావు, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా నాయకులు నారాయణరావు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ 23 ఏళ్ల క్రితం చుండూరు దళిత వాడలో అగ్రకుల దురహంకారులు 8 మంది దళితులను ఊచకోత కోసిన ఘటన హైకోర్టుకు చాలా చిన్న విషయంగా కన్పించడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సాక్ష్యాధారాలు లేవని దళితులను హత్య చేసిన వారిని నిర్దోషులుగా తేల్చడం దారుణమన్నారు. నిందితులు నిర్దోషులైతే దళితులను హత్య చేసింది ఎవరని ప్రశ్నించారు. ఈ తీర్పు దళితులకు కోర్టులపై నమ్మకం కలిగించేలా లేదన్నారు.

 

తీర్పుపై ‘సుప్రీం’లో అప్పీల్ వేయండి

చుండూరులో దళితుల ఊచకోత కేసులో నిందితులకు దిగువ కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు  చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు తగు న్యాయం జరిగేలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.మధు ఒక ప్రకటనలో కోరారు. న్యాయం కోసం బాధితులు, దళిత, ప్రజా సంఘాలు చేసే కృషికి పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. కాగా, చుండూరు కేసులో తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న మరో ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

నిందితులు జైలు నుంచి విడుదల

చుండూరు హత్యాకాండలో నిందితులుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిని కోర్టు ఉత్తర్వుల మేరకు బుధవారం విడుదల చేశారు. వీరిలో నలుగురు ఖైదీలు వ్యవసాయ క్షేత్రం (ఓపెన్ ఎయిర్ జైలు) నుంచి విడుదలయ్యారు. మరో ఖైదీ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. వీరందరూ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 2007లో ‘చర్లపల్లి’కి వచ్చారు.

 

న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి: వీకే సింగ్



చుండూరు ఉదంతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థలోనూ సంస్కరణలు అమలుకావాల్సిన విషయాన్ని పునరుద్ఘాటించిందని సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీసు శాఖ సమన్వయ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్ సింగ్ (వీకే సింగ్) తెలిపారు. తాను రాసిన ‘ఈజ్ ఇట్ పోలీస్? కన్ఫెషన్స్ ఆఫ్ ఎ టాప్ కాప్’ పుస్తకంలోనూ ఈ అంశాన్ని వివరించానని బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చెప్పారు. ‘‘అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర డబ్బుంటేమంచి న్యాయవాదుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా సాక్ష్యాధారాలపై పైచేయి సాధించడంతోపాటు విచారణ ప్రక్రియ ఏళ్లు కొనసాగేలానూ చేయవచ్చు. హత్య వంటి తీవ్రమైన నేరాల నుంచీ బయటపడొచ్చు. 21 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు ఉదంతంలో పోలీసులతోపాటు జిల్లా, సెషన్స్ కోర్టులు నిందితులను దోషులుగా నిర్ధారించాయి. హైకోర్టు మాత్రం నిందితులంతా నిర్దోషులని తేల్చింది. ఈ ఉదంతంలో సుదీర్ఘకాలం ఎదురు చూసిన నిరుపేద దళితులకు న్యాయం జరగలేదు. డబ్బు లేని వాళ్లు మాత్రమే జైళ్లకు వెళతారని, మీడియా ప్రభావం వల్ల ధనికుల్లో కొద్దిమందే జైలుకు వెళ్తున్నారనే విషయాన్ని నా పుస్తకంలో ప్రస్తావించా. ఇప్పటికైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు రాకుంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయి. అధికార యంత్రాంగాల చేతిలో పోలీసులు పావులుగా మారడంతో సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షే అవుతోంది. రాజకీయపక్షాలు ఈ సంస్కరణల్నే తమ ప్రధాన డిమాండ్‌గా మార్చుకోవాలి. మేధావి వర్గం, మీడియా సైతం ఆ కోణంలో కృషి చేయాలి. చుండూరు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ‘ఈజ్ ఇట్ పోలీస్?’ పుస్తకంలో ఉన్న అంశాలను ప్రస్పుటం చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top