తెలంగాణ వస్తే అభివృద్ధి సాధ్యమనుకున్నాం | Sakshi
Sakshi News home page

తెలంగాణ వస్తే అభివృద్ధి సాధ్యమనుకున్నాం

Published Mon, Oct 15 2018 2:16 AM

Professor Haragopal comments on irrigation sector - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ వస్తే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని భావించామని.. కానీ ఆశలు అడియాసలు అయ్యాయని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక మూడవ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ‘తెలంగాణ అభివృద్ధి–సామాజిక, ఆర్థిక సవాళ్లు, సానుకూలతలు’ అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. సదస్సులో హరగోపాల్‌ మాట్లాడుతూ.. నీటిపారుదల రంగంలో కాంట్రాక్టర్ల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణకు హైదరాబాద్‌ నుంచి అద్వితీయమైన ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.లక్షా 70 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రజారంజకమైన పథకాలకు ఖర్చు పెడితే కొంత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. భూపంపిణీ చేయనిదే అట్టడుగువర్గాల జీవితాల్లో మార్పు రాదన్నారు. కేరళ మాదిరిగా బడ్జెట్‌లో 37 శాతాన్ని విద్యారంగానికి కేటాయిస్తే మానవ వనరులు సృష్టించబడతాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక విలువలు నిర్దాక్షిణ్యంగా అణచివేయబడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో నిధులతోపాటు చైతన్యవంతమైన ప్రజలు అందుబాటులో ఉన్నారని, కానీ ఈ రెండింటినీ ఉపయోగించి అభివృద్ధి చేయకపోగా ప్రజల పాత్రను నిరాకరిస్తున్నారని విమర్శించారు.  

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ 
సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. కానీ ఈ రెండింటినీ లొంగదీసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మీడియా సంస్థల అధిపతులు, ఇతర పారిశ్రామిక యాజమాన్యాల మీద ఐటీ దాడులు జరగాల్సినప్పుడు జరగకుండా అవసరానికి ఉపయోగపడనప్పుడు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ కూడా పౌర హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక వెబ్‌సైట్‌ను కె.రామచంద్రమూర్తి ప్రారంభించారు. జేవీవీ రాష్ట్ర నాయకుడు డా.అందె సత్యం అ«ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్‌ ఎం.ఆదినారాయణ, టి.శ్రీనాథ్, డా.రమాదేవి, రాజామాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement