న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి శ్రీకారం

Process Starts To Fill Judge Vacancies Hyderabad High Court - Sakshi

ప్రక్రియ ప్రారంభించిన హైకోర్టు కొలీజియం 

నేడు సుప్రీం కోర్టుకు పంపనున్న హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి కొలీజియం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా న్యాయమూర్తుల పోస్టులకు న్యాయవాదుల కోటా నుంచి ఏడుగురిని ఎంపిక చేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వీరి పేర్లను శుక్రవారం సుప్రీం కోర్టుకు పంపనున్నట్లు సమాచారం. కొలీజియం ఎంపిక చేసిన వారిలో సీనియర్‌ న్యాయవాది ఆర్‌.రఘునందన్‌రావు (వెలమ), తడకమళ్ల వినోద్‌కుమార్‌ (బ్రాహ్మణ), బట్టు దేవానంద్‌ (ఎస్సీ), నైనాల జయసూర్య (కాపు), డి.రమేశ్‌ (కమ్మ), అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి (రెడ్డి), కూనురు లక్ష్మణ్‌ (గౌడ్‌) ఉన్నారు. వీరిలో రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, జయసూర్య, రమేశ్‌లు ఏపీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు తెలంగాణకు చెందిన వారు. వీరితో పాటు జిల్లా జడ్జీల కోటా నుంచి ఏడుగురు న్యాయాధికారులకు సైతం హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాలనీ కొలీజియం నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా, ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. మిగిలిన 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తే మిగిలిన న్యాయమూర్తుల్లో 10 మంది న్యాయమూర్తులు న్యాయాధికారుల కోటా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

ఖాళీలతో జడ్జీలపై భారం.. 
దాదాపు 50 శాతం న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులు తీవ్ర పనిభారంతో ఒత్తిడికి గురవుతున్నారు. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడంతో కేసులు విచారణకు నోచుకోక న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బం ది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ ఈ అక్టోబర్‌తో ఆ బాధ్యతలు చేపట్టి 3 నెలలు పూర్తయింది. ఈ కాలంలో హైకోర్టు న్యాయవాదుల గురించి ఆయన తగిన అవగాహన తెచ్చుకున్నారు. దీంతో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. కొలీజియంలో సభ్యులుగా ఉన్న జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కలసి న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

సుదీర్ఘ వడపోత.. 
కొలీజియం ఈ నెల 9న ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో సమావేశమై సుదీర్ఘ సమయం పాటు వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పలు సమీకరణల ఆధారంగా ఏడుగురు న్యాయవాదులను ఎం పిక చేసింది. ఈ ఎంపిక గురించి ఆ ఏడుగురికీ తెలియజేసి వారి అంగీకారం కూడా తీసుకుంది. అనంతరం వారి ఆదాయపు పన్ను వివరాలు, వాదించిన కేసులు, లా జర్నల్స్‌లో రిపోర్ట్‌ అయిన కేసులు తదితర వివరాలను పరిశీలించి వారి పేర్లను సుప్రీం కోర్టుకు పం పాలని నిర్ణయించింది. మరో కాపీ కేంద్రానికి కూడా వెళ్తుంది. ఈ జాబితా లోని వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ బ్యూరో ద్వారా కేంద్రం తెప్పించుకుం ది. ఆ వ్యక్తుల ఐబీ నివేదికలను కేంద్రం సుప్రీం కోర్టుకు పంపుతుంది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు తమ ముందున్న జాబితా విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. జాబితా అందుకున్న రెండు నెలల్లోపు కేంద్రం ఐబీ నివేదికలను సుప్రీం కోర్టుకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పంపకపోతే ఆ జాబితా విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు భావించి ఆ జాబితాను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top