చార్జీల మోత వెనుక.. ‘ప్రైవేటు’ హస్తం 

Private Hand Behind Flight Charges Increment - Sakshi

విమానచార్జీలు భారీగా పెరిగాయని ప్రచారం

ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీ

కనబడకుండా కొత్త ఎత్తుగడ

పథకం ప్రకారం.. ప్రజా రవాణా సంస్థలపై దుష్ప్రచారం

పండుగ వేళ బెంబేలెత్తిన ప్రయాణికులు 

సాక్షి, హైదరాబాద్‌ : అసలే సంక్రాంతి సీజన్‌ ..హైదరాబాద్‌ నుంచి స్వస్థలాలకు వెళ్లేవారికి ఇది ఎంతో ఒత్తిడికి గురిచేసే కాలం. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు రవాణా సంస్థలు ఇష్టారాజ్యం రేట్లతో ప్రయాణికుల జేబులు కొల్లగొడుతుండటం రివాజుగా మారిపోయింది. ఆర్టీసీ కూడా రద్దీ వేళల దృష్ట్యా కొంచెం ఎక్కువే వసూలు చేస్తుంటుంది. దీంతో పాటు విమాన చార్జీలు కూడా వేలకు వేలు పెరిగాయంటూ కొన్ని మాధ్యమాలు, ఓ చానల్‌ చేసిన ప్రచారం అందర్నీ బెంబేలెత్తించింది.

అదీ  బెంగళూరుకు రూ. 80 వేలు, విజయవాడకు రూ.50వేలు, రాజమండ్రికి రూ.70వేలు, విశాఖకు రూ.75 వేలు అంటూ బుధవారం మీడియాలో జరిగిన ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తాజాగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ దినపత్రిక (సాక్షి కాదు) దాదాపుగా ఇలాంటి వార్తనే ప్రచురించడంతో గందరగోళానికి కారణమైంది.  తెలంగాణలో ఆర్టీసీ 50 శాతానికి మించి అధిక చార్జీలు వసూలు చేయడం లేదు. పండుగ వేళల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి తిరు గు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి ఉన్నందుకే తాము ఆ మొత్తం వసూలు చేస్తున్నామని ఆర్టీసీ చెప్తోంది.
 
వెబ్‌సైట్‌ను చూపి..  

ఈ ప్రచారానికి ఊతమిచ్చింది విమాన టికెట్లు బుక్‌చేసే టికెట్‌ బుకింగ్‌ అగ్రిగేటర్‌ వెబ్‌సైట్‌ కావడం విశేషం. అందులోని లొసుగుల ఆధారంగా విమానయాన చార్జీలపై దుష్ప్రచారానికి కొన్ని వర్గాలు తెగబడ్డాయని విమానయాన సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. వీరి వెనుక ప్రైవేటు రవాణా సంస్థలు ఉన్నాయని వారి వాదన. వాస్తవానికి విమానాల్లో మిగిలి పోయిన సీట్ల మొత్తం చార్జీని ఆ వెబ్‌సైట్‌ చూపిస్తుంది. అయితే చూసేందుకు అది ఒకే సీటు చార్జీలా కనిపిస్తుంది. ఇలా టికెట్ల మోత మోగిందని ప్రచారం రాజుకుంది. 

లీగల్‌ చర్యలకు సిద్ధమవుతోన్న సంస్థలు.. 
ఈ ప్రచారం వల్ల చాలామంది విమాన ప్రయాణికులు ప్రైవేటు బస్సులవైపు మళ్లారు. దీనిపై సదరు టికెట్‌ అగ్రిగేటింగ్‌ సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ సంస్థను ఆధారంగా చూపి తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెబ్‌సైట్‌ ప్రతినిధులు స్పష్టంచేశారు. తమ విమాన సంస్థలపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆ సంస్థలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. వారు త్వరలోనే కేంద్ర విమానయానశాఖకు ఫిర్యాదు చేయబోతున్నారు. 

వాస్తవ చార్జీలు ఇవీ.. 

వాస్తవానికి మనదేశంలోని ఏ ప్రాంతానికైనా టికెట్‌ ధర రూ.5వేలకు మించదు. ఆకస్మికంగానో, లేదా అదనపు సౌకర్యాలున్న వాటిలో ప్రయాణించినా మరో రూ. 3– 4 వేలే అదనం కాగా... గరిష్టంగా 9 వేలు దాటదు. ఆఫర్లు ద్వారా..లేదా నెల ముందే బుక్‌ చేసుకుంటే ఈ ప్రయాణం రూ.రెండువేలలోపే ఉండే అవకాశాలూ ఉన్నాయి. ఇందులోనే జీఎస్టీ, సర్వీసుచార్జీలు, బీమా అన్నీ కలిపి ఉంటాయి.తాజాగా ఉన్న విమానయాన చార్జీలు గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top