ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులుగా అమర్, మాజిద్‌

Press Council of India reconstituted - Sakshi

పీసీఐ సభ్యులుగా 18 మంది నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) సభ్యులుగా తెలంగాణ నుంచి ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, కార్యవర్గ సభ్యుడు ఎంఏ మాజిద్‌ నియమితులయ్యారు.

పీసీఐకి దేశవ్యాప్తంగా వర్కింగ్‌ జర్నలిస్టుల కోటా నుంచి ఏడుగురు సభ్యులను ఎంపిక చేయగా.. అందులో ఐజేయూ నుంచి అమర్, మాజిద్‌లతోపాటు బల్వీందర్‌సింగ్‌ జమ్మూ (పంజాబ్‌), ప్రభాత్‌దాస్, శరత్‌ బెహెరా (ఒడిశా)లు నియమితులయ్యారు.

వీరితోపాటు వార్తా పత్రికల యాజమాన్యాల కేటగిరీ కింద నలుగురికి, సంపాదకుల కేటగిరీ కింద మరో నలుగురికి, వార్తా సంస్థల కేటగిరీ నుంచి ఒకరికి కలిపి మొత్తం 18 మందికి పీసీఐ సభ్యులుగా అవకాశం లభించింది. వీరంతా మూడేళ్లపాటు పీసీఐ సభ్యులుగా కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  

హర్షం వ్యక్తం చేసిన టీఎస్‌యూడబ్ల్యూజే..
తమ సంస్థ సభ్యులు దేవులపల్లి అమర్, ఎంఏ మాజిద్‌లు ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులుగా నియామకం కావడంపై తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (టీఎస్‌యూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్‌ అధ్యక్షుడు ఎన్‌.శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ ఒక ప్రకటన విడుదల చేశారు.

పీసీఐ సభ్యులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. వారు పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి, జర్నలిజంలో నైతిక విలువలను పెంపొందించడానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పీసీఐ సభ్యులుగా నియమితులైన ఐజేయూ నాయకులకు పీసీఐ మాజీ సభ్యుడు కె.అమర్‌నాథ్‌ అభినందనలు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top